దేశవ్యాప్తంగా ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈ ఆరు స్థానాల్లో అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
ఉప ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..
తమిళనాడులో మదురాంతకం, ధారపురం, పుదుచ్చేరిలో తట్టంచావడి, పశ్చిమ బెంగాల్‌లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహించనున్నారు. అస్సాంలో నాగావ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ రాజీనామా చేయడంతో లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో నాగావ్ స్థానంపై ఉప ఎన్నిక ఆసక్తిని పెంచుతోంది.
అత్యంత కీలకంగా నందిగ్రామ్..!
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ ఉప ఎన్నిక రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి పోటీ చేసి అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించారు. అనంతరం ఆయన ఆ స్థానానికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మమతా బెనర్జీ మరోసారి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
రెజీనగర్‌లోనూ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తమిళనాడులో మదురాంతకం, ధారపురం, పుదుచ్చేరిలో తట్టంచావడి స్థానాలు కూడా ప్రజాప్రతినిధుల రాజీనామాలతో ఖాళీ అయ్యాయి. ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..