Headlines

మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్‌ దాడి, పరిస్థితి విషమం!


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. స్నేహితులతో కలిసి మద్యం తాగిన అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో, ఓ యువకుడిపై రసాయన ద్రవం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డుకు చెందిన జెసిబి డ్రైవర్ షేక్ గౌస్ (19) ను సోమవారం (సెప్టెంబర్ 7)మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అతడి స్నేహితుడు బుడ్డా వినయ్ బయటకు తీసుకెళ్లాడు. వీరంతా కలిసి మార్కండేయ నగర్‌లోని గంగోత్రి వాటర్ ప్లాంట్ సమీపంలో మద్యం సేవించారు. ఆ సమయంలో స్నేహితుల మధ్య తీవ్ర వివాదం రేగడంతో, గౌస్‌పై మిగతా స్నేహితులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా అతడిపై రసాయన ద్రవం పోయడంతో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.

ఈ దాడి ఘటనలో గౌస్ ఎడమ చెంప, తల, చెవి భాగం, ఎడమ ఛాతీ, భుజాలు, రెండు చేతులు, తొడలపై తీవ్రమైన గాయాలయ్యాయి. దాడి అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న గౌస్ తన అన్న షేక్ హైమద్‌కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. అయితే అన్న అందుబాటులో లేకపోవడంతో తన తండ్రిని, ఇతర స్నేహితులను వెంటనే సంఘటనా స్థలానికి పంపించాడు. తీవ్ర భయాందోళనకు గురైన గౌస్ అక్కడి నుంచి పరిగెత్తి కేసీఆర్ కాలనీలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఒకరి ఇంట్లో దాచుకున్నాడు.

కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గౌస్‌ను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఉస్మానియా ఆస్పత్రి ఐసీయూ (ICU)లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘోర ఘటనపై బాధితుడి అన్న షేక్ హైమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీ మన్మధ కుమార్ వెల్లడించారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *