ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విమానాశ్రయ ఏర్పాటుకు గుర్తించిన ప్రతిపాదిత స్థలాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మల్టీ డిసిప్లినరీ సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సాంకేతికపరమైన అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతోపాటు.. కొత్తగూడెం పరిధిలోని ప్రతిపాదిత స్థలాల్లో విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ఏఏఐ సభ్యులు భరత్ రెడ్డి, ఎండీ ఏవియేషన్ నేతృత్వంలోని సాంకేతిక బృందం ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాలను మంగళవారం కూడా పరిశీలించింది. భూమి లభ్యత, స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రన్‌వే ఏర్పాటుకు అనుకూలత, విమానాల రాకపోకలకు అవసరమైన అప్రోచ్ ఫన్నెల్, నైట్ ల్యాండింగ్, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధ్యయనం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ములకలపల్లి మండలం తిమ్మంపేట, దుమ్ముగూడెంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించింది. AAI సభ్యులు భరత్‌రెడ్డి, ఏవియేషన్ ఎండీ నేతృత్వంలోని సాంకేతిక బృందం ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లింది. అధికారుల బృందంతో పాటు.. ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కూడా భూముల సర్వేలో పాల్గొన్నారు.
టెక్నికల్‌గా అంచనా
ఈ సందర్భంగా.. భూమి స్వభావం, ఎత్తుపల్లాలు, కొండలు, కొండచరియలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, రహదారులు, రైల్వే మార్గాలు, విద్యుత్ లైన్లు లాంటి అంశాలపై AAI టీమ్ ఫోకస్ చేసింది. ఎయిర్‌పోర్ట్‌కు అత్యంత కీలకమైన రన్‌వే ఏర్పాటుకు అవసరమైన ప్రాంతం, విమానాల రాకపోకలకు సంబంధించిన అప్రోచ్ ప్రాంతం, పరిసరాల్లో ఉన్న అడ్డంకులను టెక్నికల్‌గా అంచనా వేసింది. ఈ క్రమంలోనే.. సాంకేతికంగా ఎయిర్పోర్ట్ సాధ్యాసాధ్యాల నివేదిక, సంబంధిత శాఖల అనుమతులు, భౌగోళిక–పర్యావరణ అంశాలు, భవిష్యత్ కనెక్టివిటీపై సమగ్రంగా పరిశీలించనుంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటు భూముల అనుకూలతలను సాంకేతికంగా అధ్యయనం చేసిన తర్వాత AAI టీమ్ జిల్లా కలెక్టర్‌తో భేటీ అయ్యింది. ఇక.. ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు కేంద్రానికి సమర్పించనున్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం, ATR-72 తరహా విమానాలతో పాటు పెద్ద ఎయిర్‌బస్ A320/A321 విమానాల రాకపోకలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన అంశాలపై చర్చిస్తున్నారు. పెద్ద విమానాల రాకపోకలకు అనుగుణంగా సుమారు 2,500 నుంచి 2,700 మీటర్ల రన్‌వే అవసరమయ్యే అవకాశాలను సాంకేతిక బృందం పరిశీలించింది. రన్‌వే ఏర్పాటుకు అవసరమైన భూమి, భవిష్యత్ విస్తరణకు అవకాశాలు, నైట్ ల్యాండింగ్‌కు అవసరమైన సదుపాయాలు, భద్రతా పరికరాలు తదితర అంశాలపై కూడా అధ్యయనం చేశారు. ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో ఉన్న విద్యుదీకరించిన బొగ్గు రవాణా రైల్వే లైన్ కూడా సాంకేతిక బృందం పరిశీలనలో ప్రధాన అంశంగా నిలిచింది.
జిల్లాలో ప్రతిపాధిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాలుగా సుజాతానగర్ మండలంలోని సీతంపేట, సుజాతానగర్, దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, దమ్మపేట మండలంలోని పాల్వంచ, దమ్మపేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రాంతాలను గుర్తించి పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..