Headlines

బంపర్​ ఆఫర్ ప్రకటించిన Royal Enfield.. అదనపు ఖర్చు లేకుండా బైక్​కు వచ్చేవి ఏంటో తెలుసా?


సాధారణంగా బైక్ కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ అందించే ఫ్యాక్టరీ వారంటీ నిర్దిష్ట కాలానికే పరిమితమవుతుంది. ఆ గడువు ముగిసిన తర్వాత అదనపు వారంటీ కావాలంటే ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే Royal Enfield తీసుకొచ్చిన కొత్త విధానం దీనికి భిన్నంగా ఉంది. ప్రతి ఏడాది అధీకృత సర్వీస్ సెంటర్‌లో బైక్‌కు షెడ్యూల్డ్ సర్వీసింగ్ చేయించుకుంటే వారంటీని కొనసాగించుకోవచ్చు. దీంతో కస్టమర్లకు దీర్ఘకాలిక రక్షణ లభించడంతో పాటు, బైక్ నిర్వహణ కూడా క్రమం తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది.

10 ఏళ్ల వారంటీ

Royal Enfield కొత్త పథకం ప్రకారం ముందుగా బైక్‌కు లభించే సాధారణ మూడేళ్ల ఫ్యాక్టరీ వారంటీ పూర్తవ్వాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లో షెడ్యూల్డ్ సర్వీస్ చేయించుకోవాలి. ఇలా సర్వీసింగ్ పూర్తయిన ప్రతిసారీ అదనంగా 12 నెలల వారంటీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ విధానాన్ని బైక్‌కు 10 ఏళ్లు పూర్తయ్యే వరకు లేదా 70,000 మైళ్లు ప్రయాణించే వరకు కొనసాగించవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో వారంటీ ముగుస్తుంది.

ఈ పథకం 350cc J-సిరీస్‌లో Classic 350, Hunter 350, Meteor 350, Bullet 350 మోడళ్లకు వర్తిస్తుంది. 450cc Sherpa ప్లాట్‌ఫామ్‌లో Himalayan 450, Guerrilla 450 అర్హత పొందాయి. 650cc ట్విన్ సిరీస్‌లో Interceptor 650, Continental GT 650, Super Meteor 650, Shotgun 650, Bear 650, Classic 650 మోడళ్లకు కూడా ఈ అవకాశం ఉంది. కొత్త 750cc మోడళ్లు సైతం అర్హత పొందుతాయి. అయితే పాత UCE 500cc మోడళ్లు, Himalayan 411, Scram 411లకు ఇది వర్తించదు.

పాత బైక్‌లకు కూడా అవకాశం..

ఇప్పటికే Royal Enfield బైక్‌లు కలిగి ఉన్న యూకే కస్టమర్లు కూడా నిబంధనలకు అనుగుణంగా ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. గతంలో ప్రైవేట్ గ్యారేజీల్లో సర్వీసింగ్ చేయించుకున్నవారు సైతం అధీకృత డీలర్‌షిప్‌లో చెల్లింపు ఆధారంగా షెడ్యూల్డ్ సర్వీస్ చేయించుకుని, ఉచిత Vehicle Health Checkup పూర్తి చేయాలి. అయితే వారంటీ క్లెయిమ్ కోసం 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఊహించని మెకానికల్, ఎలక్ట్రికల్ విడిభాగాల వైఫల్యాలకు కవరేజ్ లభిస్తుంది. బ్రేక్ ప్యాడ్స్, చైన్, స్ప్రాకెట్లు, టైర్లు, ఫిల్టర్లు, బాడీ వర్క్ వంటి సాధారణంగా అరిగిపోయే భాగాలకు మాత్రం వారంటీ వర్తించదు.

ప్రస్తుతం ఈ 10 ఏళ్ల వారంటీ పథకం యూకేలో రిజిస్టర్ అయిన బైక్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌లో Royal Enfield కస్టమర్లకు సాధారణంగా మూడేళ్ల ఫ్యాక్టరీ వారంటీ లభిస్తోంది. అదనంగా Ride Sure ప్రోగ్రామ్ ద్వారా చెల్లింపు ఆధారంగా గరిష్ఠంగా ఏడేళ్లు లేదా 70,000 కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ పొందవచ్చు. అయితే భారత్‌లోనూ కొత్త 10 ఏళ్ల పథకాన్ని ప్రారంభించే విషయంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి భారతీయ బైక్ ప్రియులు ఈ పథకం కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *