Headlines

ఎన్ని రోజులైనా గోధుమ పిండి పురుగులు పట్టదు.. ఇలా చేస్తే నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది..


ప్రతి ఇంటి వంటగదిలో నిత్యం ఉండే ముఖ్యమైన ఆహార పదార్థాల్లో గోధుమ పిండి ఒకటి. చపాతీలు, పరాఠాలు, పూరీల కోసం చాలామంది ఒకేసారి 5 లేదా 10 కిలోల ప్యాకెట్లను కొని నిల్వ చేసుకుంటారు. అయితే వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ పెరగడం వల్ల గోధుమ పిండిలో త్వరగా పురుగులు, నుసి పట్టే సమస్య ఎదురవుతుంది. ఒక్కసారి పురుగు పడితే పిండి అంతా వృథాగా పారేయాల్సి వస్తుంది. అలా కాకుండా గోధుమ పిండి నెలల తరబడి తాజాగా ఉండాలంటే కొన్ని సులభమైన కిచెన్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పిండి డబ్బాలో పురుగులు చేరకుండా ఉండటానికి బిర్యానీ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటి నుంచి వచ్చే ఘాటైన సహజ సువాసనకు పురుగులు, కీటకాలు దగ్గరకు రావు. పిండి పోసే డబ్బా అడుగున రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి, ఆ తర్వాత పిండి నింపాలి. పైన కూడా మరో రెండు ఆకులు పెట్టి మూత గట్టిగా బిగించాలి. వాడుకునేటప్పుడు వీటిని సులభంగా పక్కకు తీయొచ్చు.

ఉప్పు కలపడం

వంటగదిలో ఉండే ఉప్పు కూడా పిండిని పాడవకుండా కాపాడుతుంది. ఒకేసారి కాకుండా రెండు దశల్లో ఉప్పును కలపాలి. ముందుగా డబ్బాలో సగం పిండి పోసి, అందులో 2 నుంచి 3 చెంచాల ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మిగిలిన పిండిని పోసి, పైన మరో 1 లేదా 2 చెంచాల ఉప్పు చల్లి కలిపితే పిండి అంతటా ఉప్పు సమంగా వ్యాపించి తేమను పీల్చుకుంటుంది.

స్టీల్ డబ్బా – ఎండలో ఆరబెట్టడం

గోధుమ పిండికి తేమ పెద్ద శత్రువు. తేమ తగిలితే పిండి ఉండలు కట్టడమే కాకుండా త్వరగా పాడవుతుంది. కాబట్టి పిండిని నిల్వ చేయడానికి గాలి చొరబడని స్టీల్ డబ్బాను ఎంచుకోవడం ఉత్తమం. పిండి పోసే ముందు ఆ డబ్బాను శుభ్రంగా కడిగి, ఒక్క చుక్క కూడా తడి లేకుండా కాసేపు ఎండలో ఆరబెట్టిన తర్వాతే వాడాలి.

ఫ్రిజ్‌లో నిల్వ చేయడం

మీరు తక్కువ పరిమాణంలో పిండిని వాడుతుంటే లేదా వాతావరణం మరీ తేమగా ఉంటే, పిండిని గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దీనివల్ల బయటి గాలి, తేమ లోపలికి వెళ్లకుండా పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

కొనేటప్పుడే ఈ జాగ్రత్త తప్పనిసరి

దుకాణంలో గోధుమ పిండి ప్యాకెట్ కొనేటప్పుడే దానిపై ఉన్న తయారీ తేదీని తప్పకుండా పరిశీలించాలి. ఎప్పుడో తయారైన పాత స్టాక్ కొనకూడదు. సాధారణంగా పిండి తయారైన తేదీ నుంచి నెల రోజుల లోపు వాడుకోవడం ఆరోగ్యానికి, రుచికి ఎంతో మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *