
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ అంటే కేవలం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చిహ్నం మాత్రమే కాదు, అది ఇప్పుడు ఒక ‘స్టైల్ స్టేట్‌మెంట్’గా మారిపోయింది. రాజకీయ సభల నుండి పెళ్లి వేడుకల వరకు బుల్డోజర్ల హవా కొనసాగుతోంది. తాజాగా డియోరియా జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు బుల్డోజర్‌పై ఊరేగి రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
డియోరియా జిల్లా సలేంపూర్ పరిధిలోని ఖఖ్రి గ్రామానికి చెందిన రాగిణి రాజ్‌భర్ వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు జరిగే ‘మట్కోడ్వా’ (మట్టి తీసే ఆచారం) వేడుకను అత్యంత విలక్షణంగా నిర్వహించాలని ఆమె నలుగురు సోదరులు నిర్ణయించుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలకు పల్లకీలు లేదా కార్లను ఉపయోగిస్తారు. కానీ వీరు మాత్రం ఏకంగా ఒక బుల్డోజర్‌ను రంగంలోకి దించారు.
వధువు రాగిణిని అందంగా ముస్తాబు చేసి, పూలతో అలంకరించిన పసుపు రంగు బుల్డోజర్ ముందు భాగంలోని బకెట్‌పై కూర్చోబెట్టారు. ఆ దృశ్యం గ్రామంలోని వారందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం బుల్డోజర్ మాత్రమే కాకుండా, ఊరేగింపు ముందు భాగంలో ఏనుగులు, గుర్రాలు నడుస్తూ రాజసాన్ని తెచ్చిపెట్టాయి. వెనుక డప్పులు, డీజే సంగీతానికి గ్రామస్తులు, బంధువులు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. గ్రామ వీధుల గుండా ఈ ‘బుల్డోజర్ రథం’ వెళ్తుంటే, జనం తమ ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి మరీ ఈ వింతను ఆసక్తిగా చూశారు.
తమ ఏకైక సోదరిపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఆమె సోదరులు చేసిన ఈ సాహసోపేతమైన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. వధువు రాగిణి కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో బుల్డోజర్‌పై కూర్చుని కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వినూత్న ఆలోచనను మెచ్చుకుంటూ, “యూపీలో బుల్డోజర్ క్రేజ్ మామూలుగా లేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ, ఒక సాధారణ వేడుకను ఈ కుటుంబం చిరస్మరణీయంగా మార్చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఈ ‘బుల్డోజర్ పెళ్లి’ గురించే చర్చించుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..