Headlines

పెళ్లి చేయలేదనీ.. పెట్రోల్ పోసి సొంత ఇంటికే నిప్పు పెట్టిన కొడుకు!


కడప, నవంబర్ 19: పెళ్లి చేయలేదనే కోపంతో కన్నతల్లిపై కక్ష పెంచుకున్న ఓ కుమారుడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లి నివాసం ఉంటున్న ఇంటికే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..

జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువు రాజీవ్ కాలనీలో వై. వరలక్ష్మి తన ఇద్దరు కుమారులతో కలిసి నివసించేది. అయితే కొన్ని నెలల క్రితం చిన్న కుమారుడికి వివాహం జరిగింది. దీంతో తనకు కూడా పెళ్లి చేయాలంటూ పెద్ద కుమారుడు సురేంద్ర తల్లితో తరచూ గొడవ పడేవాడు. చిన్న కుమారుడు వివాహం చేసుకుని వేరే కాపురం పెట్టగా, తల్లిపై కోపంతో పెద్ద కుమారుడు సురేంద్ర కూడా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేని సమయాన్ని అదునుగా చేసుకున్న సురేంద్ర పెట్రోల్ తీసుకొచ్చి ఆమె నివాసం ఉంటున్న ఇంటికి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులకు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి



సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెళ్లి విషయంలో తల్లితో ఏర్పడిన విభేదాల కారణంగా సొంత ఇంటికే నిప్పు పెట్టిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *