ఆస్ట్రేలియా: సాధారణంగా పార్లమెంట్ సమావేశాలంటే వాడివేడి చర్చలు, రాజకీయ విమర్శలు, కీలక బిల్లులపై వాదోపవాదాలు కనిపిస్తుంటాయి. కానీ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన ఓ ముద్దైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సెనేటర్ తన ఆరు నెలల పాపను ఒడిలో పెట్టుకుని సభలో ప్రసంగిస్తుండగా.. వెనుక కూర్చున్న మరో మహిళా సెనేటర్ ఆ చిన్నారితో దాగుడుమూతలు ఆడుతూ కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ దృశ్యాలను చూసి ఫిదా అవుతున్నారు.
కెమెరాకు చిక్కిన మధుర క్షణాలు!
నవంబర్ 24, 25 తేదీల్లో జరిగిన ఆస్ట్రేలియా సెనేట్ సమావేశాల్లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమాన్ తన ఆరు నెలల కుమార్తె ఆలియాను ఎత్తుకుని సభలో ప్రసంగించారు. ఆమె ప్రసంగిస్తుండగా వెనుక వరుసలో కూర్చున్న మరో స్వతంత్ర సెనేటర్ లిడియా థోర్ప్ చిన్నారిని గమనించారు.
వెంటనే పాపను నవ్వించేందుకు ముఖ కవళికలు మార్చుతూ, చేతులతో సరదా హావభావాలు చేస్తూ దాగుడుమూతలు ఆడారు. తల్లి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, లిడియా చిన్నారిని అలరించిన తీరు అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అసలు ఏం జరుగుతోంది? ఏ బిల్లుపై చర్చ?
ఈ మధురమైన సంఘటన జరిగిన సమయంలో సెనేట్‌లో Digital Duty of Care Bill 2026పై కీలక చర్చలు జరిగాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో వినియోగదారుల భద్రత, ముఖ్యంగా పిల్లలను హానికరమైన డిజిటల్ కంటెంట్ నుంచి రక్షించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు ప్రకారం సోషల్ మీడియా సంస్థలు, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్, యాప్స్, ఏఐ సేవలు తమ వినియోగదారులకు సురక్షితమైన వాతావరణం కల్పించే బాధ్యత తీసుకోవాలి. హానికరమైన కంటెంట్‌ను ముందుగానే గుర్తించి నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు ప్రపంచవ్యాప్త ఆదాయంలో 5 శాతం వరకు జరిమానా విధించే అవకాశం, బాధితులకు సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు కల్పించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి. నవంబర్ 25న పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి.
సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు. “లిడియా ఆంటీదే అసలైన విజయం!” అని ఒకరు పేర్కొన్నారు. “ఇలాంటి కార్యాలయ వాతావరణం ప్రతి చోటా ఉండాలి.” అంటూ మరొకరు రాశారు. “తల్లి తన బాధ్యతలు నిర్వర్తిస్తుంటే మరో మహిళ పాపను చూసుకోవడం ఎంతో ముచ్చటగా ఉంది.” అంటూ ఇంకొక వినియోగదారు పేర్కొన్నారు. “రాజకీయాల మధ్య ఇలాంటి మానవీయ క్షణాలు చూడటం ఆనందంగా ఉంది.” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పార్లమెంట్‌లోకి పిల్లలను తీసుకురావడానికి అనుమతి!
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లోని ప్రత్యేక నిబంధనల ప్రకారం సెనేటర్లు తమ చిన్నారులను సభలోకి తీసుకురావచ్చు. పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే పిల్లలకు పాలివ్వడం, అవసరమైన సంరక్షణ అందించడం కూడా సాధ్యమవుతుంది. పని, మాతృత్వ బాధ్యతలను సమన్వయం చేసుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.
మొత్తానికి రాజకీయ వేదికపై ఓవైపు కీలక బిల్లుపై చర్చ జరుగుతుంటే.. మరోవైపు ఇద్దరు మహిళా సెనేటర్లు చూపించిన ఆప్యాయత అందరి మనసులు గెలుచుకుంది. అందుకే ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..