
నాన్ వెజ్ ప్రియులు చేపట కూరను ఇష్టంగా తింటారు.. అయితే.. చేపల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి.. ముఖ్యంగా.. పెద్ద చేపలతో పోలిస్తే.. చిన్న చేపల కూర అద్భుతంగా ఉంటుంది. అందుకే.. చాలా మంది పరికలు ఇష్టపడుతుంటారు. సాధారణంగా చిన్న చేపలు గ్రామాల్లో చెరువులు, కుంటలలో దొరుకుతాయి.. అందుకే.. చాలా మంది వీటిని వండుకోని తింటారు.. అయితే.. చిన్న చేపల పులుసు తయారీ అనేది తెలుగు వంటకాలలో ఒక సాంప్రదాయక, రుచికరమైన వంటకం. ఈ వంటకాన్ని సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.. దీనిలో ముఖ్యంగా చేపలను శుభ్రపరచడం నుండి పులుసును వండే వరకు పలు దశలు ఉంటాయి. అయితే, పరికల పులుసును ఎలా వండుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
ముందుగా చిన్న చేపలను మీకు కావాల్సిన పరిమాణంలో తీసుకోవాలి..
దీనికి కావలసిన ఇతర పదార్థాలు: సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర, జీలకర్ర పొడి, పసుపు , కచ్చాపచ్చాగా రుబ్బిన ఉల్లిపాయ ముద్ద (చేపల పరిమాణాన్ని బట్టి.. నాలుగైదు తీసుకోవచ్చు), సన్నగా తరిగిన టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన చింతపండు, ఆయిల్, కారం, పసుపు తీసుకోవాలి..
చేపలను శుభ్రపరచడం చాలా కీలకం. చేపను గరుకు నేలపై రుద్ది పొలుసు మొత్తాన్ని తొలగించాలి. ఆ తరువాత దాని తల, తోక, రెక్కలు, అలాగే లోపల ఉండే భాగాలను పూర్తిగా తీసివేయాలి. పొట్టభాగాన్ని శుభ్రంగా రుద్ది, మిగతా చేపలను కూడా ఇదే విధంగా శుభ్రం చేయాలి. క్లీన్ చేసిన చేపల్లో కొద్దిగా సాల్ట్, వెనిగర్ (లేదా నిమ్మరసం) వేసి కలిపి రెండు నుండి మూడు నిమిషాలు ఉంచాలి. అనంతరం, రన్నింగ్ వాటర్‌లో నాలుగు నుండి ఐదు సార్లు బాగా కడగాలి.
శుభ్రపరచిన చేపల్లో పచ్చి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు కలిపి బాగా మిక్స్ చేసి, అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇది చేపలకు మసాలా బాగా పట్టేలా చేస్తుంది.
వంట ప్రక్రియ..
వెడల్పాటి మూకుడు పెట్టుకుని అందులో ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు రెండు నిమిషాలు వేయించాలి.
తరువాత సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి మెత్తబడేంత వరకు వేయించాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత నానబెట్టిన చింతపండు గుజ్జును వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేయాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను నెమ్మదిగా అందులో వేసి, గరిటెతో బాగా కలపకుండా, మొత్తం గ్రేవీలో సమానంగా సర్దుకోవాలి. మూత పెట్టి, మీడియం మంటపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ పైన నూనె తేలుతుంది. ఇది కర్రీ సిద్ధమైనట్లు సూచిస్తుంది. చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన చిన్న చేపల పులుసు సిద్ధం అవుతుంది. ఇది అన్నం, పులావులో వేసుకుని ఇష్టంగా తినవచ్చు.. కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..