Headlines

నోటిఫికేషన్స్ సరే ఆలోచనలు? స్మార్ట్‌ఫోన్ బానిసత్వం నుంచి బయటపడే మార్గాలివే

నోటిఫికేషన్స్ సరే ఆలోచనలు? స్మార్ట్‌ఫోన్ బానిసత్వం నుంచి బయటపడే మార్గాలివే


నోటిఫికేషన్స్ సరే ఆలోచనలు? స్మార్ట్‌ఫోన్ బానిసత్వం నుంచి బయటపడే మార్గాలివే

చాలామంది ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచినా లేదా ‘డూ నాట్ డిస్టర్బ్’ ఫీచర్ ఆన్ చేసినా మనసు మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతోంది. దీనికి కారణం సాంకేతికత కాదు, మన ఆలోచనా ధోరణి అని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ ప్రపంచం నుండి దూరంగా ఉంటూ మన కోసం మనం కొంత సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో చూద్దాం.

సమస్య ఫోన్ కాదు..

చాలా మంది ఫోన్‌ను రివర్స్‌లో పెట్టినా లేదా నోటిఫికేషన్లు ఆపేసినా తాము నియంత్రణలో ఉన్నామని అనుకుంటారు. కానీ అసలు సమస్య బయటి నుండి వచ్చే నోటిఫికేషన్లు కాదు.. అవి రాకపోయినా మనం ఫోన్ వైపు వెతకడమే! డిజిటల్ డిటాక్స్ నిపుణులు చెప్పినట్లుగా, బయటి వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు, మనకు మనమే నిరంతరం డిస్టబెన్స్ కలిగించుకుంటున్నాము. ఫోన్ సెట్టింగ్స్ మార్చడం ద్వారా కాల్స్ లేదా మెసేజ్లను ఆపొచ్చు కానీ, మన మనసులో ఉండే ఆరాటాన్ని ఆపలేము. ఎవరైనా మెసేజ్ చేశారా? ఏదైనా లైక్ వచ్చిందా? అనే తాపత్రయం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే సెట్టింగ్స్ మార్చడం కంటే, మన ప్రవర్తనను మార్చుకోవడం ఇక్కడ అత్యంత ముఖ్యం.

దీనిని అధిగమించడానికి ‘డిజిటల్ డిటాక్స్’ ఒక అద్భుతమైన మార్గం. మీరు కొంత సమయం ఆఫ్‌లైన్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా తెలియజేయడం మంచి పద్ధతి. ఉదాహరణకు, మీ వాట్సాప్ స్టేటస్‌లో ‘నేను డిజిటల్ డిటాక్స్‌లో ఉన్నాను’ అని పెట్టడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రెండు, అవతలి వారికి మీరు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదో క్లారిటీ వస్తుంది. ఇది మీ వ్యక్తిగత ప్రశాంతతకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

మార్పు కోసం అడుగులు

సాంకేతికత మనకు ఒక సాధనం మాత్రమే కావాలి తప్ప అది మన జీవితాన్ని శాసించకూడదు. దానికి మనం హద్దులు పెట్టుకోకపోవడమే అసలైన సమస్య. ఈ అలవాటును మార్చుకోవడానికి కొన్ని చిన్న మార్పులు ప్రయత్నించి చూడండి. నిద్రలేచిన తర్వాత మొదటి 30 నుండి 60 నిమిషాల వరకు అసలు ఫోన్ ముట్టుకోవద్దు. ఆ సమయంలో వ్యాయామం లేదా ధ్యానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే భోజనం చేస్తున్నప్పుడు లేదా కుటుంబ సభ్యులతో గడుపుతున్నప్పుడు ఫోన్‌ను పక్క గదిలో ఉంచడం అలవాటు చేసుకోవాలి.

ఫోన్ సైలెంట్ మోడ్ అనేది కేవలం పరికరాన్ని నిశ్శబ్దంగా ఉంచుతుంది, కానీ మీ ఆలోచనలను కాదు. మనం ఫోన్ నుండి దూరంగా ఉండటం అంటే ప్రపంచం నుండి తప్పుకోవడం కాదు, మన కోసం మనం కొంత సమయాన్ని, ప్రశాంతతను వెతుక్కోవడం. ప్రపంచం ఎక్కడికీ వెళ్ళదు, కానీ మీ ప్రశాంతత మాత్రం చాలా అవసరం. ఈ మార్పు మీ మనసులో తీసుకునే ఒక గట్టి నిర్ణయం నుండే మొదలవుతుంది. నేటి నుండి ఒక గంట పాటు ఫోన్‌ను పక్కన పెట్టి మీతో మీరు గడపడానికి ప్రయత్నించండి, ఆ మార్పు మీకే తెలుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *