Headlines

నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్.. ముగ్గురు కమిషనర్ల కీలక భేటీ..


కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత విభేదాలపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, కమిషన్ అంతర్గత వ్యవహారాలపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోను జతచేస్తూ ఎన్నికల సంఘం ఓ సమగ్ర ప్రకటనను విడుదల చేసింది.

వివాదం ఏమిటి?

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన పలు ఆదేశాలపై ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫామ్ 6లో మార్పులు, ఆన్‌లైన్ వ్యవస్థ ECINET పనితీరు, ఐటీ విభాగంలో పని పంపకాలు, పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ అప్పీళ్లు, గోవా ఓటర్ల అంశాలపై వారు కేబినెట్ సెక్రటరీకి లేఖ కూడా రాసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలు రాజకీయంగా, పరిపాలనాపరంగా పెను దుమారం రేపాయి.

విభేదాలు లేవు.. ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు

దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్ణయాలు కమిషన్ పూర్తి ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2025 జూన్ 24న బిహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి జారీ చేసిన ఎస్‌ఐఆర్ ఆదేశాలకు కమిషన్ సభ్యులందరి ఆమోదం ఉందని తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2026 మే 27న సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని గుర్తుచేసింది. అలాగే 12 రాష్ట్రాలు, యూటీల షెడ్యూల్, 19 రాష్ట్రాలు, యూటీల షెడ్యూల్ ప్రకటనలు కూడా ముగ్గురి ఏకగ్రీవ ఆమోదంతోనే విడుదలైనట్లు వెల్లడించింది. మూడో దశలోని మిగిలిన 12 రాష్ట్రాల్లో తుది జాబితా ప్రచురణ తర్వాతే మొత్తం ఓటర్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలిపింది.

క్యాబినెట్ సెక్రటరీకి లేఖపై వివరణ

కమిషనర్లు సంధు, జోషిలు క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాశారంటూ వచ్చిన వార్తలపై ఈసీ పత్రికా ప్రకటనలో స్పష్టతనిచ్చింది. ఆ లేఖ కమిషన్ విధానపరమైన నిర్ణయాలకు లేదా ఐటీ విభాగానికి సంబంధించినది కాదని, కేవలం డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ అధికారి పనితీరుకు సంబంధించిన అంతర్గత అంశం మాత్రమేనని తెలిపింది. సదరు అధికారి జారీ చేసిన పని విభజన ఉత్తర్వులు అమల్లోకి రాలేదని, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పర్యవేక్షణ కొనసాగుతూనే ఉందని తేల్చిచెప్పింది.

ఫామ్ 6 – గోవా ఓటర్లు

ఫామ్ 6లో తల్లిదండ్రుల పేర్లతో గత ఎస్ఐఆర్‌కు అనుసంధానించే డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. సాధారణ రోజుల్లో ఎలక్టర్స్ రూల్స్, 1960 ప్రకారం నిర్ణయించిన ఫారాలనే వాడతామని తెలిపింది. మరోవైపు గోవాలో మిగిలిపోయిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారాలు సేకరించాలని బీఎల్వోలను ఆదేశించామని, 97 మందిలో ఇప్పటికే 81 మంది ఫామ్ 6 పూర్తి చేశారని ఈసీ వెల్లడించింది.

ఇటీవల ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథనం దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ వివరణతో ఆ వివాదానికి తెరపడినట్లయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *