బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం రాత్రికి విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే వీలుంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. APలోని కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ అయింది. సాయంత్రం 5:30 గంటలలోగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల భారీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు రానున్న నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం సూచించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాల అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కలెక్టరేట్, GVMC సిటీ ఆపరేషన్ సెంటర్, అలాగే విశాఖ, భీమిలి RDO కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, మండల కేంద్రాల నుంచి అధికారులందరూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లు కఠిన ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలకు కలెక్టర్ ఎస్. రామసుందరరెడ్డి నేడు సెలవు ప్రకటించారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఎవరూ చెట్లు, హోర్డింగుల కింద ఉండొద్దని సూచించారు. మరోవైపు వర్షపు నీరు భారీగా చేరుతుండటంతో ప్రత్తి పంటల్లో నీరు నిల్వ ఉండి పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో నిన్న ఒక్కరోజే అత్యధికంగా పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 10 సెం.మీ, సంతబొమ్మాలి, సోంపేట, కోటబొమ్మాలి, టెక్కలి మండలాల్లో 9 సెం.మీ, పోలాకి, నరసన్నపేట మండలాల్లో 8 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలోని క్రాఫ్ట్ బజార్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇల్లీస్‌పురం జంక్షన్, గోవిందనగర్ సహా టెక్కలి, కాశీబుగ్గల్లోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జిల్లాలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసు అందిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జీకే వీధి మండలంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీలేరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం పడింది.భారీ ఈదురుగాలుల కారణంగా సీలేరులో గత మూడు గంటలుగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వేదావతి నదికి వరద నీరు పోటెత్తింది. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నది మార్గంలో ప్రవాహం ఉధృతంగా మారడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గూళ్యం గ్రామం వద్ద వేదావతి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో నరసాపురం తీరంలోని సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, అలలు బలంగా తీరాన్ని తాకుతుండటంతో సముద్ర తీరం కోతకు గురవుతున్నది.సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అధికారులు పేరుపాలెం ,కెపి పాలెం బీచ్ లలోకి ఎవరిని వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలలు ఉదృతంగా ఉండడంతో సముద్రంలోకి ఈ నెల 26 వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు వద్ద సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారింది. భారీ ఈదురుగాలుల కారణంగా కెరటాలు ఎగసిపడుతూ తీర ప్రాంతాన్ని భయపెడుతున్నాయి. గత రెండు రోజులుగా కోనసీమ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అసాధారణంగా మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని యంత్రాంగం ఇప్పటికే కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్‌పై వారికి రూ.600 తగ్గింపు!
సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్ పైనా కేంద్రం కొత్త రూల్స్
Gold Price Today: పెరిగిన పసిడి.. స్థిరంగా వెండి ధర