Headlines

తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో ఉద్యోగం వస్తే రూ.1.75లక్షల ఆర్థిక సాయం!


విదేశాల్లో ఉద్యోగాలు సాధించే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సీఎం విదేశీ ఉపాధి పథకం’ను ప్రారంభిస్తోంది. టామ్‌కామ్‌ ద్వారా అమలయ్యే ఈ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో 7 వేల మందికి సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇతర వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసి విదేశీ ఉద్యోగాలు పొందిన యువతకు వీసా, విమాన ప్రయాణ ఖర్చులు, విదేశీ భాషల శిక్షణ, నైపుణ్య ధ్రువీకరణ కోసం ఆర్థిక సాయం అందించనున్నారు.

అదనపు శిక్షణ అవసరం లేకుండా విదేశాలకు వెళ్లే 5,880 మందికి గరిష్ఠంగా రూ.50 వేల వరకు, విదేశీ భాషల్లో శిక్షణ అవసరమైన మరో 1,120 మందికి రూ.1.75 లక్షల వరకు ప్రభుత్వ రాయితీ లభించనుంది. అభ్యర్థులు తమ వాటా చెల్లించేందుకు ఇబ్బంది పడితే బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న తెలంగాణ స్థానికులు ఈ పథకానికి అర్హులు.

ఆరు నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండటంతో పాటు కనీసం ఆరు నెలల గడువు ఉన్న పాస్‌పోర్టు, విదేశీ ఉద్యోగ సంస్థ నిర్వహించిన వైద్య పరీక్షల అర్హత ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే అవకాశం కల్పిస్తారు. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హతలు, నైపుణ్య ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా ఉపాధి కల్పన అధికారులు దరఖాస్తులను పరిశీలించి, రాష్ట్రస్థాయి కమిటీ తుది ఎంపిక చేపడుతుంది.

ఇలా ఎంపికైన వారికి తొలుత మంజూరైన సాయంలో సగం చెల్లిస్తారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగంలో చేరినట్లు ఆధారాలు సమర్పించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా ఆర్థిక స్థోమత లేని యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *