Headlines

తల పగిలిపోయే నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. కంగారుగా డాక్టర్లు బ్రెయిన్ CT స్కాన్ తీయగా..!

తల పగిలిపోయే నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. కంగారుగా డాక్టర్లు బ్రెయిన్ CT స్కాన్ తీయగా..!


చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో నివసించే వాంగ్ టియాన్‌కింగ్ అనే వ్యక్తి కథ వింటే ‘వార్నీ.. ఇది సినిమా స్టోరీ కాదు కదా!’ అనిపించక మానదు. తన తలలో ఒక బుల్లెట్ ఉందన్న విషయం తెలియకుండానే ఆయన ఏకంగా 23 ఏళ్ల పాటు సాధారణ జీవితాన్ని గడిపారు. వైద్య చరిత్రలోనే ఇదొక అరుదైన మరియు విస్మయకరమైన సంఘటనగా నిలిచిపోయింది.

అసలేం జరిగింది..?

ఈ కథ 1988లో మొదలైంది. ఒకరోజు వాంగ్ నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఏదో వస్తువు వచ్చి బలంగా అతని తలకు తగిలింది. విపరీతమైన నొప్పితో అతను కిందపడిపోయాడు. అయితే, ఎవరో అల్లరి మూకలు వడిసెలతో రాయి విసిరి తనను కొట్టారని వాంగ్ భావించాడు. గాయం చిన్నదిగా ఉండటం, రక్తస్రావం తక్కువగా కావడంతో, అతను దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఒక సాధారణ కట్టు కట్టుకుని, ఆ నొప్పిని భరిస్తూ తన పనిలో నిమగ్నమయ్యాడు. క్రమంగా ఆ గాయం పైన చర్మం పెరిగి, ఆ సంఘటనను అతను పూర్తిగా మర్చిపోయాడు.

23 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన నిజం!

2011లో వాంగ్‌కు తరచుగా విపరీతమైన తలనొప్పి, మూర్ఛలు రావడం మొదలైంది. ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు అతనికి CT స్కాన్ నిర్వహించారు. ఆ రిపోర్టు చూసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాంగ్ మెదడుకు కుడి వైపున ఒక తుపాకీ బుల్లెట్ ఇరుక్కుపోయి ఉండటాన్ని వారు గుర్తించారు. రాయి తగిలిందని వాంగ్ అనుకున్నది నిజానికి అది ఒక తూటా! ఈ బుల్లెట్ వల్ల వాంగ్ ప్రాణాలకు ముప్పు కలగకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలను వైద్యులు గుర్తించారు. బుల్లెట్ చాలా తక్కువ వేగంతో వచ్చి ఉండవచ్చు, అందుకే అది మెదడులోని సున్నితమైన భాగాలను చీల్చుకుంటూ లోపలికి వెళ్లకుండా ఒక మూలలో ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు, బుల్లెట్ మెదడులోని నరాలకు నష్టం కలిగించని సురక్షితమైన ప్రదేశంలో స్థిరపడిందని డాక్టర్లు వెల్లడించారు. రెండు దశాబ్దాల పాటు లోహపు ముక్క శరీరంలో ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ సోకకపోవడం ఒక అద్భుతమే అంటున్నారు.

చివరకు, వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి ఆ బుల్లెట్‌ను విజయవంతంగా తొలగించారు. నేడు వాంగ్ టియాన్‌కింగ్ ఆరోగ్యంగా ఉన్నారు. మృత్యువును తన తలలోనే మోస్తూ రెండు దశాబ్దాల పాటు జీవించిన ఆయన ఉదంతం, మానవ శరీరం శక్తిని, అదృష్టాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *