Headlines

డీజిల్ దొంగతనం చేసి పారిపోతుండగా రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డీజిల్ దొంగ

డీజిల్ దొంగతనం చేసి పారిపోతుండగా రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డీజిల్ దొంగ


అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండ సమీపంలో 67వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేసి పారిపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. టయోటా ఇటియోస్ కారు ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కారును నడుపుతున్న వ్యక్తి బయటకు రాలేక కారులోనే సజీవ దహనమై అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాద సమయంలో కారులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన వారిగా ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి బయటపడి అక్కడి నుంచి పరారయ్యారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, కాలిపోయిన కారుకు సుమారు 20 మీటర్ల దూరంలో రెండు డీజిల్ క్యాన్లు కనిపించాయి. లారీని ఢీకొన్న సమయంలో కారులో ఉన్న డీజిల్ క్యాన్లు లీక్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైనట్లు భావిస్తున్నారు.

మొదట ఇది సాధారణ రోడ్డు ప్రమాదమని పోలీసులు అనుమానించారు. అయితే విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీలు, ఇతర వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేసి, దొంగిలించిన డీజిల్ క్యాన్లతో కారులో పారిపోతుండగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన లారీ డ్రైవర్ కూడా కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు రాలేక మృతి చెందినట్లు పోలీసులకు తెలిపాడు. కారులో సజీవ దహనమైన వ్యక్తి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే ప్రమాదం నుంచి తప్పించుకుని పరారైన ఇద్దరి కోసం గుత్తి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *