జస్ట్‌ 20 నిమిషాలే.. ఆ రూట్‌లో ప్రయాణం మరింత సులభం.. ఇక దూసుకెళ్లడమే

జస్ట్‌ 20 నిమిషాలే.. ఆ రూట్‌లో ప్రయాణం మరింత సులభం.. ఇక దూసుకెళ్లడమే


ప్రస్తుతం విజయవాడ నగరం గుండా కరకట్ట రహదారి మీదుగా అమరావతికి వెళ్లే మార్గంలో తీవ్ర రద్దీ ఉంటుంది. ముఖ్యంగా వీఐపీలు విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత ఈ ట్రాఫిక్ వల్ల ఆలస్యం ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వెస్ట్ బైపాస్‌ను ప్రధాన ప్రవేశ మార్గంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 49 కిలోమీటర్ల పొడవున్న ఈ బైపాస్‌లో కృష్ణా నదిపై నిర్మించిన భారీ వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆరు నుంచి ఎనిమిది లేన్లతో నిర్మితమైన ఈ వంతెన ద్వారా రాజధానిలోకి ప్రవేశించడం సులభం అవుతుంది.

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ మార్గంలో ప్రయాణించి పనుల పురోగతిని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ హైవే అందుబాటులో ఉండటం వల్ల వీఐపీలు త్వరగా ఎయిర్‌పోర్టు, అమరావతి మధ్య రాకపోకలు సాగిస్తారు. ఈ మార్గం కొత్తగా వచ్చే అతిథులకు అమరావతిని ఆకర్షణీయంగా పరిచయం చేసేలా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రహదారి అత్యాధినిక హంగులతో తీర్చి దిద్దుతోంది.

ఇప్పటికే చిన్నవట్టుపల్లి నుంచి వెంకటపాలెం వరకు రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన డ్రైనేజీ వంటి కీలక పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, అమరావతికి ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది.

త్వరలోనే ఈ రహదారిని అధికారికంగా వీఐపీ రూట్‌గా ప్రకటించే అవకాశం ఉంది. అమరావతి రాజమార్గంగా దీనికి గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆధునిక సదుపాయాలతో రూపొందుతున్న ఈ మార్గం రాజధాని ప్రతిష్టను మరింత పెంచేలా ఉండనుంది. భవిష్యత్తులో విదేశీ ప్రతినిధులు, ప్రముఖులకు ఈ రహదారి గొప్ప స్వాగతం పలకనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *