Headlines

చైనాలో కొత్త ట్రెండ్.. ముఖాన్ని అద్దెకిస్తూ లక్షల్లో సంపాదన!


కొన్ని ప్లాట్‌ఫామ్‌లైతే ఒకరి ముఖాన్ని ఉపయోగించినందుకు ఏకంగా రూ. 14 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. బ్యాంకులో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి ముఖాన్ని ఒక ప్రకటన సంస్థ కేవలం మూడు రోజుల్లో ఏడు సార్లు వాడింది. అందుకు ప్రతిఫలంగా అతనికి సుమారు రూ. 36,000 పారితోషికం ఇచ్చింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు తమ ముఖాలను, శరీర కదలికలను హై-టెక్ కెమెరాల ద్వారా 3D స్కానింగ్ చేయిస్తున్నారు. ఆ తర్వాత, ఆ ముఖాలను నిర్దిష్ట కాలం పాటు ఉపయోగించుకోవడానికి కంపెనీలతో ఒక చట్టబద్ధమైన ఒప్పందం లేదా లైసెన్స్  కుదుర్చుకుంటారు. చైనాలో టిక్‌టాక్, డోయిన్ లాంటి ప్లాట్‌ఫామ్ లలో  ఆన్‌లైన్ షాపింగ్ లైవ్ స్ట్రీమింగ్ చాలా పాపులర్.  “AI డిజిటల్ క్లోన్స్ ” 24 గంటలూ లైవ్ లో మాట్లాడుతూ  రాత్రింబవళ్లు పనిచేసి ఉత్పత్తులను విక్రయిస్తాయి. మోడళ్లను, నటులను పెట్టి షూటింగ్‌ చేయడం కంటే, ఒకసారి ముఖానికి లైసెన్స్ తీసుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ డిజిటల్ రూపాన్ని వాడుకోవచ్చని కంపెనీలు భావిస్తూ ఖర్చులను ఆదా చేస్తున్నాయి.

సామాన్యులకు లాభం

చైనాలోని టెక్ హబ్ షెంజెన్, వాణిజ్య కేంద్రమైన గ్వాంగ్‌జౌలో ఈ వ్యాపారం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఈ-కామర్స్ కంపెనీలు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఈ సేవలను విస్తృతంగా వాడుకుంటున్నాయి.  ఏజెన్సీలు రంగంలోకి దిగి, కాలేజీ విద్యార్థులు, చిన్న స్థాయి మోడల్స్, సాధారణ ఉద్యోగులను సంప్రదిస్తాయి. తమ ముఖాన్ని, గొంతును దుస్తులు లేదా కాస్మెటిక్స్ కు మాత్రమే వాడాలని కొందరు షరతులు పెడతారు.  అయితే కంపెనీలు కొన్నిసార్లు  చౌకగా ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ ముఖాలను ఇతర  ప్రమోషన్లకు వాడుకునే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మోడల్స్ రోజులో 8 నుంచి 10 గంటలు మాత్రమే పని చేస్తారు. కానీ “AI డిజిటల్ క్లోన్స్” అలసిపోకుండా 24 గంటలూ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో లైవ్ లో కనిపిస్తుంటాయి. మోడళ్లు, నటులను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లు తక్కువ ధరకే AI ముఖాలకు లైసెన్స్‌ ఇచ్చి తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాయి.

ఈ ట్రెండ్ లాభసాటిగా కనిపిస్తున్నప్పటికీ..

మనుషుల అవసరం తగ్గిపోతుండటం వల్ల పదుల సంఖ్యలో మోడల్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, లైవ్-స్ట్రీమర్లు ఉపాధిని కోల్పోతున్నారు. డిజిటల్ హక్కులకు సంబంధించి చైనాలో సరైన చట్టాలు లేకపోవడంతో, మోసపోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి మన ముఖం, గొంతు డేటా AI కంపెనీల చేతికి వెళితే, భవిష్యత్తులో వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందనీ అనుమతి లేకుండానే అసభ్యకర లేదా అక్రమ ప్రకటనలకు ఆ ముఖాలను వాడే ప్రమాదం ఉందని అంటున్నారు. చాలా మంది ఇంట్లో కూర్చోనే మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నా తమ ముఖాలను దుర్వినియోగం చేస్తారేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఒప్పందాలలో కంపెనీలతో కుదుర్చుకున్న గడువు పూర్తికాకముందే తమ లైసెన్స్‌ను వెనక్కి తీసుకుంటే.. సుమారు రూ. 7.2 లక్షల వరకు భారీ జరిమానా చెల్లించాలనే కఠిన నిబంధనలను కూడా చేర్చుతున్నారు వ్యాపారులు.  ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రవాణా, వినోదం, ఈ-కామర్స్ రంగాలపై ప్రభావం చూపడంతో పాటు, సరికొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *