Headlines

కువైట్ లో చిత్రహింసలు అనుభవించిన మహిళ సేఫ్! ఎలా బయటపడిందంటే..


“నా పేరు వనిత. నేను తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా వాసిని. కువైట్‌కు వచ్చి మూడు నెలలు అవుతోంది. నన్ను ఇక్కడ చాలా హింసిస్తున్నారు” అంటూ వనిత కన్నీళ్లతో తన ఆవేదనను వెలిబుచ్చిన వీడియో వారం రోజుల క్రితం వైరల్ గా మారింది. “నన్ను రక్షించి నా సొంత దేశమైన భారతదేశానికి తీసుకువెళ్లాలని కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నాను. గత రెండు నెలలుగా నాకు జీతం కూడా ఇవ్వలేదు. ఇక్కడ జరుగుతున్న హింసను నేను ఇకపై భరించలేను” అని ఆ వీడియోలో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తమిళనాడు అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వారు ఈ ఘటనపై ఆరా తీయగా, బాధితురాలు కళ్లకురిచి జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు తెలిపారు. తమ కూతురిని ఎలాగైనా కాపాడి, సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ విషయమై స్పందించిన వనిత తల్లి , ఒక ఏజెంట్ కువైట్‌లో తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించి మోసం చేశాడని ఆరోపించారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్న వనిత, ఇంటి పనిమనిషిగా పనిచేయాలనే ఆశతో కువైట్ వెళ్లిందని  కానీ ఇప్పుడు ఆమె చిత్రహింసలను ఎదుర్కొంటోందని ఆమె అన్నారు.

ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు, వనితను సురక్షితంగా భారత్‌కు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఆ వీడియోలో బాధితురాలు ఒక చీకటి గదిలో రెండు చేతులు జోడించి కన్నీళ్లతో ప్రాధేయపడిన తీరు అందరినీ తీవ్రంగా కలచివేసింది.

గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే భారతీయ కార్మికులు, ముఖ్యంగా మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. మోసపూరిత ఏజెంట్ల మాటలు నమ్మి వెళ్లే వారు అక్కడ పాస్‌పోర్టులు పోగొట్టుకుని, సరైన జీతాలు అందక, యజమానుల చేతిలో నిర్బంధానికి గురై నరకయాతన అనుభవిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *