ఆకలికి రూపం తెలీదు.. అమాయకత్వానికి నిజానిజాలు అర్థం కావు. కడుపు మండిపోతుంటే ఎదురుగా కనిపించే ఆకారమే సర్వస్వం అనుకుంటుంది పసి ప్రాణం. అలాంటి ఓ గుండెల్ని పిండేసే ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తోంది. అది నిజమైన గోమాత కాదు.. రక్తమాంసాలున్న జీవి అంతకన్నా కాదు. కేవలం పాల వ్యాపార ప్రచారం కోసం ఓ పాల వ్యాన్ వెనుక అతికించిన ఆవు ఫొటో మాత్రమే. కానీ, తల్లికి దూరమై అల్లాడిపోతున్న ఓ లేగదూడకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఆ బొమ్మనే తనను కని పెంచిన కన్నతల్లి అనుకుని, ఆకలి తీర్చుకునేందుకు అది పడిన తపన చూసి ప్రతి ఒక్కరి కళ్లూ చెమ్మగిల్లుతున్నాయి.
రోడ్డుపై ఆగి ఉన్న విజయ డెయిరీకి చెందిన ఒక వ్యాన్ వెనుక భాగంలో భారీ పరిమాణంలో ఉన్న ఆవు చిత్రం ముద్రించి ఉంది. అందులో ఆవు పొదుగు భాగం స్పష్టంగా కనిపిస్తోంది. అటుగా వచ్చిన ఒక చిన్న లేగదూడకు బహుశా ఎన్నో గంటలుగా ఆహారం దొరకలేదేమో.. ఆవు ఫొటోను చూసి నిజమైన తల్లేనని గట్టిగా నమ్మింది. కడుపు నింపుకోవడానికి ఆశగా దగ్గరకు వెళ్లి, ఆ ఫొటోలోని పొదుగు వద్ద నోరు పెట్టి పాలు తాగేందుకు విఫలయత్నం చేసింది.
తనకు పాలు దొరకడం లేదన్న విషయం కూడా అర్థం చేసుకోలేని ఆ పసి అమాయకత్వాన్ని చూసిన స్థానికులు, నెటిజన్లు తీవ్రంగా చలించిపోతున్నారు. బహుశా ఆ లేగదూడ తన తల్లికి దూరమై తీవ్ర ఆకలితో అలమటిస్తూ ఇలా చేసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ‘‘తల్లి ప్రేమ కోసం ఆ మూగజీవం పడే తపన వర్ణనాతీతం’’ అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయవిదారక దృశ్యం ప్రతి ఒక్కరి కళ్లనూ చెమ్మగిల్లేలా చేస్తోంది.