డిజిటల్ చెల్లింపులు మన జీవితంలో భాగమైపోయాయి. టీ తాగినా, కూరగాయలు కొనుగోలు చేసినా, షాపింగ్ చేసినా చాలామంది UPI ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రతి లావాదేవీ జరిగిన వెంటనే బ్యాంకు నుంచి వచ్చే SMS ద్వారా ఖాతాలో డబ్బులు కట్ అయ్యాయో లేదో తెలుసుకుంటున్నారు. అయితే ఇకపై HDFC బ్యాంక్ కస్టమర్లకు ఈ విషయంలో మార్పు చోటుచేసుకోనుంది. ముఖ్యంగా చిన్న మొత్తాల UPI లావాదేవీలకు SMS అలర్ట్‌లు నిలిచిపోనున్నాయి.
జనవరి 1 నుంచి కొత్త మార్పు
HDFC బ్యాంక్ కస్టమర్లకు అందినట్లు ప్రచారంలో ఉన్న నోటిఫికేషన్ ప్రకారం.. 2027 జనవరి 1 నుంచి రూ.500 వరకు జరిగే UPI లావాదేవీలకు SMS అలర్ట్‌లు పంపడం నిలిపివేయనున్నారు. అంటే మీరు రూ.50, రూ.100, రూ.200 లేదా రూ.500 చెల్లించినా ఇకపై బ్యాంకు నుంచి సాధారణ SMS రాకపోవచ్చు. అయితే రూ.500కు మించిన లావాదేవీలకు SMS అలర్ట్‌లు కొనసాగుతాయి.
ఏమిటి RBI కొత్త నిబంధనలు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 2027 జనవరి 1 నుంచి రూ.500కు మించిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు బ్యాంకులు తక్షణ SMS అలర్ట్‌లు పంపడం తప్పనిసరి. రూ.500 లేదా అంతకంటే తక్కువ విలువైన లావాదేవీలకు SMS పంపాలా వద్దా అనేది బ్యాంకుల అంతర్గత విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పంపితే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీ విధించకూడదు. ఈ నిబంధనలు కేవలం UPIకే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి.
HDFC కస్టమర్లకు ఈమెయిల్ అలర్ట్!
SMS సేవల్లో మార్పులు వచ్చినప్పటికీ కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం HDFC బ్యాంక్ అన్ని UPI లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్‌లను కొనసాగించనుంది. అంటే చిన్న మొత్తంలో చెల్లింపులు చేసినా, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు లావాదేవీ వివరాలు అందుతాయి. బ్యాంకు విధానాన్ని బట్టి మొబైల్ యాప్, పుష్ నోటిఫికేషన్ల ద్వారా కూడా సమాచారం అందే అవకాశం ఉంది. RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకు వద్ద ఈమెయిల్ చిరునామా అందుబాటులో ఉన్న కస్టమర్లకు ఎలక్ట్రానిక్ లావాదేవీలన్నింటికీ ఈమెయిల్ అలర్ట్‌లు పంపాలి.
కస్టమర్లు ఏం చేయాలి?
HDFC కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్, ఈమెయిల్ చిరునామా సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. అలాగే బ్యాంకు మొబైల్ యాప్‌లో లావాదేవీల నోటిఫికేషన్లు అందేలా సెట్టింగ్స్‌ను తనిఖీ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. రూ.500లోపు లావాదేవీలకు SMS రాకపోయినా, UPI చెల్లింపులు నిలిచిపోవు. మారేది కేవలం లావాదేవీ సమాచారం అందించే విధానం మాత్రమే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..