ఒకే ఛార్జర్‌తో పలు పరికరాలను ఛార్జ్ చేయగలిగితే ప్రయాణాలు మరింత సులభంగా మారతాయి. Ugreen కొత్త ట్రావెల్ ఛార్జర్లో రెండు Type-C, ఒక USB-A పోర్టులు ఉన్నాయి. ఒక్క పోర్ట్ ద్వారా 67W వరకు పవర్ అందిస్తుంది. అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా ప్లగ్లకు సపోర్ట్ ఉండటంతో విదేశీ ప్రయాణాల్లోనూ ఉపయోగపడుతుంది.
ప్రత్యేక అడాప్టర్ అవసరం లేదు..
ఈ ఛార్జర్లోనే అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియాలో ఉపయోగించే ప్లగ్లకు సపోర్ట్ ఇచ్చారు. దీంతో ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక అడాప్టర్ లేదా కన్వర్టర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 100V నుంచి 240V వరకు పవర్ ఇన్పుట్ను ఇది సపోర్ట్ చేస్తుంది. AirPura 2.0 టెక్నాలజీతో కాంపాక్ట్‌గా రూపొందించిన ఈ ఛార్జర్ బరువు కేవలం 166 గ్రాములు. చిన్న ప్యాకెట్ పరిమాణంలో ఉండటంతో బ్యాగ్‌లో సులభంగా పెట్టుకోవచ్చు. ప్రయాణాల్లో ఎక్కువ స్థలం ఆక్రమించదు.
మూడు పరికరాలకు ఒకేసారి ఛార్జింగ్..
ఇందులో రెండు Type-C పోర్టులు, ఒక USB-A పోర్ట్ కలిపి మొత్తం మూడు పోర్టులు ఉన్నాయి. ఒక్క Type-C పోర్ట్‌ను ఉపయోగించినప్పుడు గరిష్ఠంగా 67W పవర్ అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, ట్యాబ్లెట్లు వంటి పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు. చిన్న గ్యాడ్జెట్లు, ఇయర్‌బడ్స్ కోసం USB-A పోర్ట్ ఉపయోగపడుతుంది. మూడు పోర్టులను ఒకేసారి వాడినా మొత్తం పవర్ 67W వరకు ఉంటుంది.
ఇందులో ఛార్జింగ్ వివరాలను చూపించే చిన్న స్క్రీన్ కూడా ఉంది. ఛార్జింగ్ వేగం, కరెంట్, పనిచేస్తున్న ప్రోటోకాల్ వంటి వివరాలను ఇందులో చూడొచ్చు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు రక్షణ కోసం సేఫ్టీ మోడ్ పనిచేసేలా టెంపరేచర్ కంట్రోల్ వ్యవస్థను ఇచ్చారు. PPS ప్రాయారిటీ మోడ్‌ను కూడా బటన్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఛార్జర్ చైనా మార్కెట్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ధర సుమారు 189 యువాన్లు, అంటే దాదాపు రూ.2,250గా ఉంది. 18 నెలల వారంటీ కూడా ఇస్తున్నారు. ఇతర దేశాల్లో లభ్యతపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.