Match Fixing: ఇటీవల అంగరంగ వైభవంగా ముగిసిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(DPL) టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. టోర్నమెంట్‌లోని ఒక ఫ్రాంచైజీకి చెందిన కొందరు ఆటగాళ్లపై, మ్యాచ్‌ల నిర్వహణలో గడబిడ జరిగిందంటూ కొన్ని సంచలన వార్తలు బయటికి వచ్చాయి. ఈ పరిణామాలపై స్పందించిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) మంగళవారం నాడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మీడియాలో వస్తున్న వార్తలపై బోర్డు స్పందిస్తూ.. ప్రస్తుతం ఎలాంటి ఆరోపణలు కూడా అధికారికంగా రుజువు కాలేదని, దీని వెనుక అసలు నిజానిజాలు నిగ్గు తేల్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
డీడీసీఏ అధికారిక ప్రకటన
ఈ వివాదంపై డీడీసీఏ బోర్డు మాట్లాడుతూ.. “ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి కొన్ని వార్తా సంస్థల్లో వస్తున్న ఫిక్సింగ్ వార్తలను మా దృష్టికి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఏ అధికారిక అధికారి కూడా ఈ ఆరోపణలను ధృవీకరించలేదు. ఎలాంటి తప్పు రుజువు కాలేదు. కేవలం వస్తున్న పుకార్లు లేదా నిరూపితం కాని ఆరోపణల ఆధారంగా ఏ ఆటగాడిని గానీ, ఫ్రాంచైజీని గానీ దోషులుగా నిర్ధారించడం సరికాదు. ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత ఉన్నతాధికారులకు లేఖ రాశాం. నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ జరపాల్సిందిగా కోరాం” అని క్లారిటీ ఇచ్చింది.
ఫిక్సింగ్ ఆరోపణలపై జీరో టాలరెన్స్ విధానం
క్రికెట్ ఆట పవిత్రతను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని డీడీసీఏ తేల్చిచెప్పింది. అవినీతికి తావులేని విధంగా జీరో టాలరెన్స్ పాలసీని కచ్చితంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆట విశ్వసనీయతను, గౌరవాన్ని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బోర్డు విజ్ఞప్తి చేసింది. సరైన దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి అంచనాలకు రావద్దని అభిమానులను కోరింది.
స్టింగ్ ఆపరేషన్
ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మొత్తం వివాదం ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడింది. టోర్నమెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్ల మధ్య జరిగిన ఏడవ మ్యాచ్ సందర్భంగా ఈ తంతు నడిచినట్లు సమాచారం. మాజీ రంజీ ఆటగాడు రచిత్ భాటియా రహస్యంగా షూట్ చేయబడిన ఒక వీడియోలో మ్యాచ్ ఫిక్సింగ్ గురించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండానే రికార్డ్ అయిన ఈ వీడియోలో టాస్కు ముందే కీలక సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆయన మాట్లాడటం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అసలు దోషులు ఎవరనేది తేల్చేందుకు అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..