లండన్‌లో విక్రయించే ఒక క్యాన్ ఫాంటాలో కేవలం 63 కేలరీలు ( 3-4 స్పూన్ల చక్కెర) మాత్రమే ఉండగా, భారతదేశంలో విక్రయించే అదే సైజ్ క్యాన్‌లో 185 కేలరీలు (సుమారు 9-10 స్పూన్ల చక్కెర) ఉంటోంది. ఒకే అంతర్జాతీయ బ్రాండ్ అయినప్పటికీ, దేశాన్ని బట్టి నాణ్యత, చక్కెర శాతంలో ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై ఆహార భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూకేలో ‘కోల్డ్ డ్రింక్ టాక్స్’
యూకేలో శీతల పానీయాలలో చక్కెర స్థాయిని బట్టి పన్ను విధిస్తారు. 100 మిల్లీలీటర్లకు 5 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర ఉంటే కంపెనీలు భారీగా పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ పన్ను భారం తప్పించుకోవడానికి కోకాకోలా కంపెనీ అక్కడ చక్కెర శాతాన్ని 4.5 గ్రాములకు తగ్గించి, స్వీట్నర్స్ వాడుతోంది.
భారతదేశంలో జీఎస్టీ మాత్రమే
భారత్‌లో శీతల పానీయాలపై సుమారు 40% జీఎస్టీ (GST + Cess) విధిస్తున్నప్పటికీ.. అది పానీయంలో ఉండే చక్కెర శాతంతో సంబంధం లేకుండా స్థిరంగా ఉంటుంది. అందువల్ల చక్కెర తగ్గించాలనే ఒత్తిడి కంపెనీలపై ఉండదు.
యూరప్ దేశాలలో కృత్రిమ రంగులు వాడితే ప్యాకెట్ ముందు భాగంలో ‘ఫ్రంట్-ఆఫ్-ప్యాక్’ (FOPL) హెల్త్ వార్నింగ్ ఇవ్వడం తప్పనిసరి. కానీ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం వెనుక భాగంలో చిన్న అక్షరాలతో ఇస్తే సరిపోతుంది. దీనిని ఆసరాగా చేసుకుని కంపెనీలు తమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి.
అలవాట్లు కారణమా?
భారతీయ వినియోగదారులు సాధారణంగా ఎక్కువ తీపి, బ్రైట్ ఆరెంజ్ రంగును ఇష్టపడతారనే ఉద్దేశ్యంతో కంపెనీలు స్థానిక రుచులకు అనుగుణంగా రెసిపీని మారుస్తున్నాయి.
భారతదేశంలో మధుమేహం (Diabetes), ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్న తరుణంలో, అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయుల ఆరోగ్యంతో ముడిపడిన ప్రమాణాల విషయంలో వివక్ష చూపడం తగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కూడా చక్కెర శాతాన్ని బట్టి పన్నులు విధించేలా, ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరికలు ముద్రించేలా కఠినమైన చట్టాలు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
సుప్రీంకోర్టు సీరియస్
అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉండే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబుల్స్ విషయంలో ‘ఫ్రంట్-ఆఫ్-పాక్’ (ముందు భాగంలో స్పష్టంగా కనిపించే) హెచ్చరిక లేబుళ్లను ఏర్పాటు చేసే విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అనుసరిస్తున్న తీరును సుప్రీంకోర్టు ఇటీవల తప్పుబట్టింది . ప్యాకేజ్డ్ ఆహారాల్లోని హానికర పదార్థాల గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించడంలో రెగ్యులేటరీ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.