Headlines

ఏపీ DSC 2026 అప్లికేషన్లలో కొత్త చిక్కులు.. అప్లై చేయలేక అవస్థలు!


అమరావతి, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ఇబ్బందులు కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 11 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో వివరాలు నమోదు చేయడంలో, జిల్లాలను ఎంపిక చేసుకోవడంలో, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. సమస్యలను సరిచేయాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తున్నారు.

ఓపెన్ కేటగిరీలో దరఖాస్తుకు అవకాశం లేదా?

డీఎస్సీ దరఖాస్తుల్లో ప్రధానంగా జిల్లా ఎంపిక విషయంలో సమస్య ఎదురవుతోందని అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు పది లోపే ఉండగా, ఆరు జిల్లాల్లో కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖాళీలు ఉన్న జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఇతర జిల్లాల్లో ఓపెన్ కేటగిరీ కింద కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ దరఖాస్తులో స్థానిక కోటా కింద దరఖాస్తు చేసిన తర్వాత ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే అవకాశం రావడం లేదని వాపోతున్నారు. ఒకవేళ ఓపెన్ కేటగిరీని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నించినా కేవలం ఒక జిల్లానే ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.ఐఈఆర్‌టీలు, ఐఈడీఎస్‌ఎస్, సీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరు వివిధ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు.

అయితే ఆన్‌లైన్ పోర్టల్‌లో సంబంధిత విభాగాలను ఎంపిక చేసినప్పుడు తదుపరి కాలమ్‌లో కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. అవి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహణలోని సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ఎంపికలుగా ఉన్నాయని పేర్కొంటున్నారు. తమకు వర్తించే ఇతర విభాగాలను కూడా పోర్టల్‌లో చేర్చాలని, ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. విద్యార్హతలకు సంబంధించిన మరో సమస్య కూడా అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తులో డిగ్రీ ఉత్తీర్ణత సంవత్సరాన్ని 2024 వరకు మాత్రమే నమోదు చేసుకునే అవకాశం కల్పించారని చెబుతున్నారు. డిగ్రీ తర్వాత రెండేళ్ల బీఈడీ కోర్సు పూర్తి చేయాల్సి ఉండటంతో 2024 వరకు మాత్రమే అవకాశం ఇచ్చినట్లు విద్యాశాఖ చెబుతోందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అయితే ఇంటర్మీడియట్ తర్వాత 2021-22లో డీఈడీ పూర్తి చేసి, ఆ తర్వాత 2025లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలోనే డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి, 2025 లేదా 2026లో అదనపు డిగ్రీలు చదివినవారు కూడా తమ విద్యార్హతల వివరాలను నమోదు చేసుకోలేకపోతున్నారని వాపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, అర్హులైన అభ్యర్థులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి



సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థుల విజ్ఞప్తి

డీఎస్సీ దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు సమయం వృథా అవుతోందని, చివరి తేదీ సమీపిస్తుండటంతో అప్లికేషన్ సమర్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఎంపిక, ఓపెన్ కేటగిరీ దరఖాస్తులు, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల విభాగాలు, డిగ్రీ ఉత్తీర్ణత సంవత్సరానికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పాఠశాల విద్యాశాఖను కోరుతున్నారు. అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగించాలని కూడా అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *