Headlines

Tirumala: తిరుమల శ్రీవారి గర్భగుడిపై ఉన్న ఆనందనిలయ విమానం.. దీని వెనుక ఎన్నో రహస్యాలు!


History of Tirumala Ananda Nilaya Vimanam Telugu: ప్రసిద్ధ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిపై కొలువై ఉన్న సువర్ణమయ నిర్మాణాన్ని ఆనందనిలయ విమానం అంటారు. అర్చావతారమూర్తి అయిన శ్రీవేంకటేశ్వరుడి ఆవాసమే ఆనందనిలయం కాగా, దాని భౌతిక స్వరూపమే విమానం. ఈ దివ్య నిర్మాణం వెనుక పురాణ గాథలతో పాటు ఎన్నో చారిత్రక విశేషాలు కూడా ఉన్నాయి.

పురాణాల్లో ఆనందనిలయ విమానం ఆవిర్భావం

పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి ఆజ్ఞతో గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాచలాన్ని భూలోకానికి తీసుకొచ్చి, సువర్ణముఖరీ నదికి ఉత్తరాన ఉన్న శేషాచల పర్వతాలపై ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి భూవరాహస్వామి ఆ పర్వతంపై నివసిస్తున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

శ్రీ వేంకటాచల మాహాత్మ్యంలో మరో ఆసక్తికరమైన గాథ ఉంది. ఒకసారి వాయుదేవుడు, ఆదిశేషుడి మధ్య వాదన జరిగి పందెం వరకు వెళ్లింది. ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని చుట్టుకొని ఉండగా, వాయుదేవుడు తన శక్తినంతా ఉపయోగించినా పర్వతాన్ని కదిలించలేకపోయాడు. చివరకు శేషునితో కూడిన ఆనందాద్రి భూలోకంలోని సువర్ణముఖరీ నది ఉత్తర తీరానికి చేరింది. ఆ తర్వాత శేషుడు శేషాచల పర్వతంగా, ఆయన శిరస్సుపై ఉన్న ఆనందపర్వతం ఆనందనిలయ విమానంగా మారినట్లు పురాణ గాథ చెబుతోంది.

ఇవి కూడా చదవండి



బ్రహ్మానందాన్ని కలిగించే దివ్య నిర్మాణం

ఆనందాద్రి అంటే పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని కలిగించే పర్వతమని అర్థం. ఈ కొండపై ఋషులు తపస్సు చేసి ఆనందమే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకున్నారని ప్రతీతి. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని వైకుంఠం కంటే గొప్పదిగా భావిస్తారు. ఆనందనిలయ విమానంలో రత్నస్తంభాలతో అలంకరించిన మహామణిమండపం ఉందని పురాణాలు వర్ణిస్తున్నాయి. అందులో శంఖచక్రధారిగా శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.

ఆనందనిలయ విమానాన్ని బంగారు తాపడం చేయించిన రాజులు

మరీచి సంహిత ప్రకారం, తొండమానుచక్రవర్తి తొలి ఆనందనిలయ విమానాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో పలువురు రాజులు ఆలయానికి మరమ్మతులు చేయించి అభివృద్ధి చేశారు.

  • క్రీ.శ. 1250–1255 మధ్య వీరనరసింగ యాదవరాయల అనుమతితో తిరుప్పుల్లానిదాసర్ ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు. అనంతరం యాదవరాయలు తన తులాభారంలో బంగారాన్ని సమర్పించి విమానానికి బంగారు తాపడం చేయించారు.
  • క్రీ.శ. 1361లో సాళువ మంగిదేవుడు ఆనందనిలయ విమానానికి బంగారుపూత వేయించారు.
  • 1417 ఆగస్టు 25న రెండవ దేవరాయల మంత్రి మల్లనమంత్రి బంగారు పూత వేయించడంతో పాటు బంగారువాకిలి ముందు మహామణిమండపాన్ని నిర్మించారు.
  • 1518 సెప్టెంబర్ 9న శ్రీకృష్ణదేవరాయలు 30 వేల వరహాలు వెచ్చించి బంగారు తాపడం చేయించారు.
  • 1630లో రెండవ వెంకటపతిరాయల కాలంలో లక్ష్మీకుమార తాతాచార్యులు బంగారుపూత వేయించారు.
  • 1909లో మహంతుల కాలంలో అధికార రామలక్కన్‌దాస్ విమానానికి బంగారు తాపడం చేయించారు.

తొమ్మిది పర్యాయాలు జీర్ణోద్ధరణ

1909 తర్వాత 1958, 2006, 2018 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆనందనిలయ దివ్యవిమానానికి మరమ్మతులు, బంగారు సొబగులు అద్ది సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఇలా ఇప్పటివరకు తొమ్మిది పర్యాయాలు ఈ దివ్యవిమానానికి జీర్ణోద్ధరణ, పవిత్రీకరణ కార్యక్రమాలు జరిగినట్లు పేర్కొంటారు.

ఆనందనిలయం కేవలం శ్రీవారి నివాసం మాత్రమే కాదు.. భక్తుల విశ్వాసానికి ప్రతీక కూడా. ఆలయంలోని మూలవిరాట్టును దర్శించుకోలేని పరిస్థితుల్లో విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. భక్తులు ఆనందనిలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని ప్రార్థిస్తారు. తిరుమల ఆలయంలో జరిగే పలు ఉత్సవాలు, అభిషేకాలకు కూడా విమాన ప్రదక్షిణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే ఆనందనిలయ విమానం తిరుమల క్షేత్రంలోని అత్యంత పవిత్రమైన నిర్మాణాల్లో ఒకటిగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది.

(Disclaimer: ఈ కథనంలోని పురాణ గాథలు, ఆధ్యాత్మిక విశేషాలు మత విశ్వాసాలు, పురాణ గ్రంథాలు, చారిత్రక శాసనాల ఆధారంగా అందించబడ్డాయి. భిన్న గ్రంథాలు, చారిత్రక ఆధారాల్లో వివరాలు మారవచ్చు.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *