న్యూఢిల్లీ: బుధవారం (సెప్టెంబర్ 09) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని ప్రధాన రైల్వే మార్గాలను మరింత ఆధునీకరించడంతో పాటు రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏడు కీలక రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌కు భారీ ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా హౌరా–చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా నాలుగు లేన్ల రైల్వే నెట్వర్క్ అభివృద్ధి చేయనున్నారు. ఈ విస్తరణతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణాకు మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ముంబై–చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లేన్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మార్గం దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే కీలక రైల్వే మార్గాల్లో ఒకటిగా ఉంది. నాలుగు లేన్ల విస్తరణ పూర్తయితే రైళ్ల వేగం, మార్గ సామర్థ్యం, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక ప్రధాన రైల్వే మార్గాల్లో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో అదనపు లైన్ల నిర్మాణం ద్వారా రైళ్ల రాకపోకలకు ఎదురయ్యే సమస్యలను తగ్గించడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలను ప్రధాన పోర్టులు, నగరాలతో అనుసంధానించడంలో ఈ కారిడార్లు కీలకంగా మారనున్నాయి. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే కీలక రైల్వే మార్గాలకు మరింత ప్రాధాన్యం లభించనుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రేణిగుంట వంటి ప్రధాన రైల్వే జంక్షన్ల మీదుగా నాలుగు లేన్ల నెట్వర్క్ అభివృద్ధి చెందితే భవిష్యత్‌లో పెరగనున్న ప్రయాణికుల, సరుకు రవాణా అవసరాలను తీర్చేందుకు ఇది ఉపయోగపడనుంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.