ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివరాలకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మీ భూమి–బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (జూలై 23) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ఏడు జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొననున్నారు. తొలి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఎంపిక చేసిన ఏడు మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు కానుంది.
ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటం వల్ల డేటా వ్యత్యాసాలు, రికార్డుల మార్పుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా బ్లాక్‌చెయిన్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇందులో ప్రతి భూ పార్సెల్‌కు ప్రత్యేకమైన బ్లాక్‌చెయిన్ గుర్తింపు కల్పిస్తారు. భూమికి సంబంధించిన ప్రతి లావాదేవీ టాంపర్ ప్రూఫ్ విధానంలో శాశ్వతంగా రికార్డు అవుతుంది.
ఈ విధానం ద్వారా భూ రికార్డుల్లో మార్పులు చేయడం పూర్తిగా నియంత్రిత ఆన్‌లైన్ ప్రక్రియగా మారనుంది. ఏ అధికారి ఎప్పుడు ఏ మార్పు చేశారనే వివరాలు కూడా శాశ్వతంగా నమోదవుతాయి. రికార్డుల్లో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే లావాదేవీని వెంటనే నిలిపివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో తొలి దశలో ఆటో మ్యూటేషన్, సబ్-డివిజన్, ఎక్స్‌టెంట్ కరెక్షన్ వంటి ఎనిమిది పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో అస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేయనున్నారు. మొత్తం 89 రీ-సర్వే గ్రామాలు, 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లు ఇందులో భాగం కానున్నాయి.
వ్యవసాయం, మత్స్యశాఖ, గనులు, పరిశ్రమలు, విద్యుత్ శాఖ, సీఆర్‌డీఏ, ఆర్థిక సంస్థలు వంటి పలు విభాగాలు అవసరమైన మేరకు ఈ భూ సమాచారాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. భూ మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, వేగవంతమైన, పారదర్శకమైన పౌర సేవలు అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..