Headlines

ఎయిర్‌పోర్టులో ఇండిగోకు తప్పిన ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొట్టిన విమానం..!


శ్రీనగర్: శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబై నుంచి శ్రీనగర్‌కు వచ్చిన ఇండిగో ఫ్లైట్ పార్కింగ్ బేకు వెళ్తుండగా VDGS స్తంభాన్ని ఢీకొట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 04) ఉదయం సుమారు 9గంటల సమయంలో బే నంబర్ 6 వద్ద ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

ల్యాండింగ్ అనంతరం విమానం తనకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢీకొనడంతో VDGS స్తంభం పక్కకు ఒరిగిపోయింది. విమానం పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం తీవ్రతపై, విమానం దెబ్బతిన్న ఖచ్చితమైన భాగాలపై పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శ్రీనగర్ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బందిని సాధారణ మెట్ల సహాయంతో విమానం నుంచి సురక్షితంగా దించారు. విమానం ఎందుకు VDGS స్తంభాన్ని ఢీకొట్టిందనే దానిపై ప్రస్తుతం ఎలాంటి నిర్ధారణకు రాలేదు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కారణాలను సంబంధిత అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ దశలో బ్రేక్ వైఫల్యం లేదా ఇతర సాంకేతిక కారణాలపై వస్తున్న ప్రచారాలను అధికారికంగా ధృవీకరించలేదు.

విమాన శ్రయ కార్యకలాపాలు యథావిధిగా..

ఈ ఘటన జరిగినప్పటికీ శ్రీనగర్ విమానాశ్రయంలో ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం విమాన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక ప్రమాదానికి గురైన విమానం తదుపరి సర్వీస్‌పై మాత్రం ప్రభావం ఉండే అవకాశం ఉంది. విమానాన్ని భద్రతా, సాంకేతిక బృందాలు పరిశీలించిన తర్వాతే దాని తదుపరి ఆపరేషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. విమానం ల్యాండింగ్ సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *