Headlines

ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్

ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్


గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ఇక కేవలం ఫోన్ చేస్తే సరిపోదు… ఈ-కేవైసీ కూడా తప్పనిసరి. లేకపోతే సిలిండర్ బుకింగ్ ఆగిపోవచ్చు… సబ్సిడీ కూడా నిలిచిపోవచ్చు. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అసలు ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి అయింది..? ఎవరు చేయించుకోవాలి..? ఈకేవైసీ చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..? ఇంట్లో నుంచే ఎలా పూర్తి చేసుకోవచ్చు..? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి దానికీ ఈ కేవైసీ కంపల్సరీ. అది లేకపోతే పనే జరగదు. నీకు ఒక పథకం వర్తించాలన్నా ఈ కేవైసీ, బ్యాంకులో పని జరగాలన్నా ఈ – కేవైసీ.. ఇప్పుడు మళ్లీ కొత్తగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాలన్నా ఈ కేవైసీ కావాల్సి వచ్చింది. ఈ కేవైసీ చేయించుకోని గ్యాస్ వినియోగదారులకు గత నెలాఖరు నుంచి సిలిండర్ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కేవైసీ లేకుంటే భవిష్యత్ సమస్యలు తప్పవంటూ గ్యాస్ కంపెనీలు ఎన్నోసార్లు హెచ్చరించాయి. అయితే చాలామంది వినియోగదారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు చాలా మందికి గ్యాస్ బుకింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా దీపం పథకం కింద.. డిపాజిట్ చెల్లించకుండానే ఉచితంగా కనెక్షన్ పొందిన లక్షలాది మంది లబ్ధిదారులు కూడా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందే. ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. ప్రతి గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేస్తున్నాయి. నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించే అవకాశముందని గ్యాస్ డీలర్లు హెచ్చరిస్తున్నారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఈ-కేవైసీ ప్రధాన ఉద్దేశం అర్హులైన వారిని గుర్తించడం, బోగస్ లేదా డూప్లికేట్ కనెక్షన్లను తొలగించడం, అలాగే గృహ అవసరాల కోసం ఇచ్చే ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించకుండా అరికట్టడం. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1.3 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 30 లక్షల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పటివరకు సుమారు 70 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. మిగిలిన 30 శాతం మంది ఇంకా ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈ పరిస్థితి కొనసాగితే ఈ-కేవైసీ చేయని కనెక్షన్లకు గ్యాస్ డెలివరీ నిలిపివేసే దిశగా కంపెనీలు చర్యలు తీసుకునే అవకాశం ఉందని డీలర్లు చెబుతున్నారు. మరోవైపు, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా గ్యాస్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ఈ ప్రక్రియ అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇక, అటు ఏపీలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.61 కోట్లు. ఇందులో సుమారు 10 శాతం మంది వినియోగదారులు ఇంకా బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఈ పెండింగ్ జాబితాలో దాదాపు 5 శాతం మంది ఇప్పటికే మరణించిన వినియోగదారులు ఉన్నారు. అంటే ఆ కనెక్షన్లు పూర్తిగా అనధికారికంగా బినామీలు వాడుతున్నవేనని స్పష్టమవుతోంది. మిగిలిన వారిలో సుమారు 2 శాతం మంది వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు పడని వయోవృద్ధులు ఉన్నారు. మిగతా వారు కేవలం వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల లేదా సరైన సమాచారం లేక ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారని ఏజెన్సీల క్షేత్రస్థాయి రికార్డులు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా, ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటే.. వారే ఈ కేవైసీ చేయాల్సి వచ్చింది. దాంతో చనిపోయిన వారి బంధువులు అధికారికంగా వాడుతున్న కనెక్షన్లకు ఇబ్బందయింది. ఈ కేవైసీ చేయకపోతే, గ్యాస్ బుకింగ్ నిలిచిపోవడంతో పాటు కేంద్రం గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీ కూడా అకౌంట్‌లో జమకావడం లేదు. ఎవరివైనా గ్యాస్ కనెక్షన్లు తాత్కాలికంగా నిలిచిపోతే మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశం ఉందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ఈ కేవైసీ చేయించుకోవాలి అనుకున్న వారు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి ఆధార్ ఇస్తే అక్కడ ఉన్నవారే అంతా చూసుకుంటారు. ఆధార్ ఇవ్వగానే వేలిముద్ర తీసుకుని గ్యాస్ కంపెనీ నిర్వాహకులు ఈ కేవైసీ పూర్తి చేస్తారు. వృద్ధ్యాప్యంలో ఉండి ఎవరైనా వేలిముద్రలు పడకపోతే వాళ్లు మాత్రం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. అక్కడ ఐరిస్ తీసుకుని ఈ కేవైసీ అప్‌డేట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా మంచానికే పరిమితమై ఉంటే, వాళ్ల కనెక్షన్లను కుటుంబ సభ్యుల పేరు మీద మార్చుకునే అవకాశం ఉంది. గ్యాస్ కనెక్షన్ల ఈ-కేవైసీ ప్రక్రియను 2024 జూన్‌లో ప్రారంభించారు. మొదట దీనికి ఏడాది గడువు ఇచ్చినప్పటికీ, తర్వాత దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఇప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడంతో ఆయిల్ కంపెనీలు వేగం పెంచాయి. గతంలో 2014లో ప్రారంభించిన ఈ-కేవైసీ కార్యక్రమం దాదాపు ఐదేళ్లపాటు కొనసాగగా, ఈసారి మాత్రం రెండేళ్లలోనే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవలి కాలంలో గృహ వినియోగానికి ఇచ్చే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను.. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వీధి వ్యాపారులు వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న ఘటనలు బయటపడటంతో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల మాదిరిగానే గ్యాస్ కనెక్షన్లలో కూడా నిజమైన లబ్ధిదారులనే గుర్తించి సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ-కేవైసీని తప్పనిసరి చేస్తున్నారు. అయితే, వినియోగదారులు ఇంటి నుంచే సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆ అవకాశం లేకపోతే గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ యాప్ ద్వారా లేదా నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణతో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక మొత్తంగా, గ్యాస్ డీలర్లు, అధికారులు ఇచ్చే ముఖ్య సలహా ఏంటంటే.. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో గ్యాస్ సరఫరా లేదా ఇతర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని చెబుతున్నారు. అందుకే ప్రతి వినియోగదారుడు తమ గ్యాస్ కనెక్షన్ ఈ-కేవైసీ స్థితిని ఒకసారి పరిశీలించి, అవసరమైతే వెంటనే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!

ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!

Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *