Headlines

ఇక నాలుగేళ్లే.. 2030 నాటికి ఏఐతో మనుషులు అంతం.. జాకబ్ కాక్సన్ సంచలన ప్రకటన !


గత మూడేళ్లుగా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి అగ్రగామి టెక్ సంస్థల్లో పనిచేసిన జాకబ్ కాక్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనకరమైన రేసును చూసి ఆయన ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రపంచాన్ని శాసించే స్వీయ ప్రతిభ గల సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల కోసం టెక్ దిగ్గజాలు మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది కాలంలోనే ఏఐ వ్యవస్థలు దేనినైనా హ్యాక్ చేసే స్థాయికి ఎదుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఈ పరిజ్ఞానం వల్ల కలగబోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఏఐ సంస్థలు పట్టించుకోవడం లేదని ఆయన హెచ్చరించారు. ఈ దశాబ్దం చివరికల్లా కృత్రిమ మేధ మనుషులందరినీ అంతం చేస్తుందని ఏఐ తయారీదారులు సైతం అంతర్గతంగా నమ్ముతున్నారని ఆయన బాంబు పేల్చారు.

ఏఐ వల్ల కలిగే ముప్పు మానవ తప్పిదాల కంటే చాలా తీవ్రమైనదని స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థకు భవిష్యత్ పరిణామాలపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ, పోటీలో అందరికంటే ముందుండాలనే పిచ్చితో అడ్డదారి తొక్కుతోందని బహిరంగంగా ఆరోపించారు. ఇతరులు ఎవరూ బాధ్యతాయుతంగా వ్యవహరించరనే నెపంతో ప్రమాదం ఉందని తెలిసినా ఆంత్రోపిక్ సంస్థ రేసులో దూసుకుపోతోందని ఆయన వివరించారు.

ఎక్స్ వేదికగా కాక్సన్ పంచుకున్న ఈ విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారి టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరూ ఊహించని విధంగా ఏఐ స్వయంగా తనంతట తాను మెరుగుపడే స్థాయికి చేరుకుంటోందని జాకబ్ తన పోస్టులో వివరించారు. ఇలాంటి శక్తిమంతమైన ఏఐ వల్ల రాత్రికి రాత్రే అన్ని రంగాల్లో మార్పులు రావడంతో పాటు, ప్రపంచంలోని వనరులన్నీ దాని గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పబ్లిసిటీ కోసం తాను ఈ మాటలు చెప్పడం లేదని, సీనియర్ పరిశోధకులు సైతం ఏఐ టెక్నాలజీ విషయంలో భయపడుతున్నారని కాక్సన్ స్పష్టం చేశారు. లాభాల కోసం ఇలా మనుషుల ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏఐ అభివృద్ధిని ఇప్పటికైనా నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో ఊహించని విపత్తులు ఎదుర్కోక తప్పదని టెక్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇలాంటి ప్రమాదకర ప్రయోగాలపై ప్రపంచ దేశాలు కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *