ఇందిరమ్మ బీమా పథకంకు సంబంధించి నమోదు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. నవంబర్ 19వ తేదీన స్టార్ట్ అవ్వగా.. డిసెంబర్ 18 వరకు జరగనుంది. ఈ స్కీములో చేరేందుకు నెల రోజుల పాటు ప్రభుత్వం గడువు కల్పించింది. దీంతో అర్హులైనవారు తమ గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి వెళ్లి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అర్హులైనవారందరూ ఈ పథకం కింద నమోదు చేయించుకుని జీవిత బీమా పొందాలని ప్రభుత్వం సూచిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ఇంటి పన్ను రసీదు కావాలా..?
అయితే ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో చేరేందుకు రేషన్, ఆధార్, మొబైల్ నెంబర్ అవసరం. అయితే ఇంటి పన్ను రసీదు కూడా అవసరమని వాట్సప్ గ్రూపుల్లో సర్క్యలేట్ అవుతుంది. దీంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇంటి పన్ను రసీదు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందేమోనని టెన్షన్ పడుతున్నారు. వాట్సప్ గ్రూపుల్లో ఇది వైరల్ అవుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. ఇంటి పన్ను రసీదు అవసరం లేదని, కేవలం రేషన్, ఆధార్, మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుందని తెలిపింది. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బీమా ఎవరి పేరు మీద అయితే చేయించుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఒకరు శిబిరానికి వెళితే సరిపోతుందని పేర్కొంది. కుటుంబసభ్యులందరూ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ జిరాక్సులు తప్పనిసరి
ఖచ్చితంగా తమ గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో మాత్రమే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇంటి పన్ను రసీదు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అధికారులకు తమ రేషన్, ఆధార్ అందించి నామినీ వివరాలు తెలిపితే సరిపోతుందంది. దివ్యాంగులు, ఎవరైనా అనారోగ్యంతో శిబిరానికి రాలేని పరిస్థితుల్లో శిబిరం ఇన్ఛార్జి వారి ఇంటి వద్దకే వెళ్లి వివరాలు నమోదు చేస్తారని స్పష్టం చేసింది. కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మాత్రమే నమోదు చేయించుకోవాలని సూచించింది. ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులు అందించాల్సి ఉంటుంది. వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. ఆధార్ కార్డులోని వయస్సును ప్రమాణికంగా తీసుకుంటారు.