Headlines

Kartikeya Temple: ఏడాదికి ఒక్కరోజే తెరుచుకునే ఆలయం.. ఇక్కడి విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు!


Gwalior Kartikeya Temple History Telugu: దేశవ్యాప్తంగా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టమైన సంప్రదాయం ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న ఓ పురాతన ఆలయం మాత్రం వీటన్నింటికంటే భిన్నం. ఎందుకంటే ఈ ఆలయం ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. అది కూడా కార్తీక పౌర్ణమి రోజునే! ఈ ఆలయం శివపార్వతుల కుమారుడైన కార్తికేయ స్వామికి అంకితం చేయబడింది. ఇక్కడ కొలువైన ఆరు ముఖాల స్వామివారిని దర్శించుకోవడానికి ఏటా వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జీవాజీగంజ్ ప్రాంతంలో ఈ పురాతన కార్తికేయ స్వామి ఆలయం ఉంది. సుమారు 400 నుంచి 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఓ ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఏడాది పొడవునా కార్తికేయ స్వామి గర్భగుడి తలుపులు మూసి ఉంచుతారు. కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే తెరిచి భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ రోజున స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని, జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కార్తీక పౌర్ణమి రోజున ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు?

కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 23 అర్ధరాత్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి అభిషేకం చేసి, వివిధ ఆభరణాలతో అలంకరిస్తారు. అనంతరం నవంబర్ 24 తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరుతారు. దర్శన కార్యక్రమం పూర్తయిన తర్వాత గర్భగుడి తలుపులను తిరిగి మూసివేస్తారు. మళ్లీ వచ్చే ఏడాది కార్తీక పౌర్ణమి వరకు స్వామివారి దర్శనానికి అవకాశం ఉండదు.

ఆరు ముఖాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు

ఈ ఆలయంలో కార్తికేయ స్వామి ఆరు ముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని స్కందుడు, మురుగన్, షడాననుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం, స్వామివారి ఆరు ముఖాలు జ్ఞానం, శక్తి, దైవత్వానికి ప్రతీకలుగా భావిస్తారు. ఆలయ సముదాయంలో హనుమంతుడు, గంగా, యమునా, సరస్వతి, లక్ష్మీనారాయణులకు ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని ఏడాది పొడవునా దర్శించుకోవచ్చు. అయితే కార్తికేయ స్వామి గర్భగుడి మాత్రం కార్తీక పౌర్ణమి నాడే తెరుచుకుంటుంది.

ఏడాదిలో ఒక్కరోజే ఎందుకు తెరుస్తారు?

ఈ ఆలయ సంప్రదాయం వెనుక ఓ ఆసక్తికరమైన పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి శివపార్వతులు తమ కుమారులైన కార్తికేయుడు, గణేశుడికి ఓ పరీక్ష పెట్టారట. భూమి చుట్టూ ముందుగా ప్రదక్షిణ చేసి వచ్చిన వారికి మొదటి పూజ అందుతుందని చెప్పారు. దీంతో కార్తికేయుడు తన నెమలిపై భూప్రదక్షిణకు బయలుదేరారు. కానీ గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, వారే తనకు సమస్త లోకాలని చాటిచెప్పారు. దీంతో శివపార్వతులు గణేశుడికి తొలిపూజ గౌరవాన్ని ప్రసాదించారు.

ఈ పరిణామంతో కార్తికేయుడు అలిగి కుటుంబానికి దూరంగా వెళ్లిపోయారని పురాణగాథ చెబుతుంది. ఆ తర్వాత శివపార్వతులు ఆయనను ఓదార్చి, కార్తీక పౌర్ణమి రోజున తమను దర్శించుకునే భక్తుల కోరికలు నెరవేరుతాయని వరమిచ్చినట్లు స్థానిక విశ్వాసం.

ఇతర రోజుల్లో దర్శనం ఎందుకు నిషేధం?

స్థానిక మత విశ్వాసాల ప్రకారం, కార్తీక పౌర్ణమి మినహా ఇతర రోజుల్లో కార్తికేయ స్వామి ప్రధాన విగ్రహాన్ని దర్శించుకోవడం మంచిది కాదని భావిస్తారు. అందుకే ఏడాది పొడవునా గర్భగుడిని మూసి ఉంచుతారు. ఈ ప్రత్యేక సంప్రదాయం కారణంగానే గ్వాలియర్‌లోని కార్తికేయ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆలయ విశిష్టతలు, పౌరాణిక కథనాలు, ఆచారాలు మతపరమైన విశ్వాసాలు, స్థానిక సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తుల నమ్మకాలుగా మాత్రమే పరిగణించాలి.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *