Headlines

ఆటోలో రూ.4 లక్షల గోల్డ్ ఆభరణాలు మర్చిపోయిన మహిళ.. ఈ డ్రైవర్ ఏం చేశాడంటే..


శ్రీకాకుళం జిల్లా రాజంలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆటోలో ప్రయాణికురాలు మరిచిపోయిన సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులున్న బ్యాగును గుర్తించిన డ్రైవర్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు అప్పగించారు.

చీపురుపల్లి మండలం పూరేయవలస గ్రామానికి చెందిన సంధ్యారాణి కుటుంబ వివాహానికి హాజరయ్యేందుకు రాజం వెళ్లారు. రాజం బస్టాండ్ సమీపంలో ఆటో దిగిన ఆమె.. తన విలువైన బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. ఆ బ్యాగులో నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా.

సంధ్యారాణి ఆటో దిగిన తర్వాత పెనుబాక గ్రామానికి చెందిన డ్రైవర్ కొణపాల భద్రి తన ఆటోలో బ్యాగును గుర్తించారు. వెంటనే రాజం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించారు. మరోవైపు బ్యాగు పోయినట్లు గుర్తించిన సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్ భద్రి సహకారంతో బ్యాగును ఆమెకు తిరిగి అందజేశారు.

భద్రి చూపిన నిజాయితీపై పోలీసులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. విలువైన వస్తువులు దొరికినా వాటిని స్వార్థం కోసం ఉపయోగించకుండా యజమానికి తిరిగి అప్పగించిన ఆయన.. సమాజానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *