ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే భారతదేశపు తొలి అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి దంగేటి బాటలోనే పయనిస్తూ, అదే నేల నుంచి మరో యువకిరణం అంతరిక్ష యవనికపై ఉదయించింది. అమెరికాలోని హ్యూస్టన్ కేంద్రంగా నాసా పర్యవేక్షణలో జరిగే ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (IASP-2027)కు యలమంచిలి మండలం కొంతేరు గ్రామానికి చెందిన 18 ఏళ్ల సిస్టా జశ్వంత్ శ్రీ ఎంపికయ్యాడు.
ఇప్పటివరకు భారతదేశం నుంచి ఈ తరహా ఘనత సాధించిన ఐదో వ్యక్తిగా, ప్రస్తుత ఎంపిక జాబితాలో దేశం తరఫున నిలిచిన ఏకైక ప్రతినిధిగా జశ్వంత్ రికార్డు సృష్టించాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఉన్న జశ్వంత్ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. తండ్రి శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగి కాగా, తల్లి సంగీత గృహిణి. పసితనంలో గ్రామ పొలాల మీదుగా ఆకాశంలో ఎగిరే విమానాలను చూస్తూ పెరిగిన జశ్వంత్లో తొలుత పైలట్ కావాలనే సంకల్పం మొదలైంది. హైస్కూల్ దశకు చేరేసరికి ఆ కల అంతరిక్ష పరిశోధనల వైపు మళ్లింది.
విమానయాన రంగంపై పరిశోధనా పత్రాలు చదవడం, అంతరిక్ష విజ్ఞానాన్ని ఔపోసన పట్టడం ద్వారా పాఠశాల విద్య పూర్తయ్యేనాటికే స్పేస్ సైన్స్‌పై స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణె సందీప్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూనే, వ్యోమగామి కావాలన్న తన దీర్ఘకాలిక లక్ష్యానికి బాటలు వేసుకుంటున్నాడు.
అంతర్జాతీయ అంతరిక్ష శిక్షణల వైపు దృష్టి సారించిన జశ్వంత్, నాసా అనుబంధ అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మూడు దశల్లో సాగిన కఠినమైన సాంకేతిక ఇంటర్వ్యూలు, మానసిక విశ్లేషణల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 14 మంది విశిష్ట ప్రతిభావంతుల్లో చోటు దక్కించుకున్నాడు. నవంబర్ 2027లో అమెరికాలో జరగనున్న ఈ శిక్షణలో అంతరిక్ష నౌకల నిర్వహణ, రాకెట్ సైన్స్, జీరో-గ్రావిటీ పరిస్థితులపై జశ్వంత్ ప్రత్యక్ష అధ్యయనం చేయనున్నాడు.
నాసా ఆహ్వానానికి ముందే జశ్వంత్ అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను రుజువు చేసుకున్నాడు. ఇటీవల పోలాండ్‌లో నిర్వహించిన అనలాగ్ స్పేస్ కాలనీ శిక్షణా కార్యక్రమంలో రెండు వారాల పాటు పాల్గొని విజయవంతంగా పూర్తి చేశాడు. కేవలం 18 ఏళ్ల అతి చిన్న వయసులోనే ‘అనలాగ్ ఆస్ట్రోనాట్’ ట్యాగ్ సంపాదించిన ఘనత సాధించాడు.
ఈ ప్రతిభను గుర్తించిన పోలాండ్‌కు చెందిన అస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ ( ఏ ఏ టి సి ), హిమాలయాల్లో నిర్వహించనున్న అత్యున్నత శిక్షణా శిబిరానికి కూడా అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. పశ్చిమగోదావరి పల్లెసీమ నుంచి మొదలైన ఒక యువకుడి అంతరిక్ష కల ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతుండటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.