Headlines

అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ!

అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ!


అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి నకిలీ ఆధారాలతో రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు యత్నించిన భారత సంతతికి చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ సూరజ్ రాజ్ సింగ్‌పై యూఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దొంగ పత్రాలతో పదే పదే తప్పుడు దరఖాస్తులు దాఖలు చేశారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు $470,584 అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 4 కోట్లు సివిల్ పెనాల్టీ విధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రక్రియను ప్రారంభించింది.

118 నకిలీ పత్రాలు.. 54 కేసులు:

యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) నిర్వహించిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాయర్ సూరజ్ రాజ్ సింగ్ మొత్తం 54 వేర్వేరు ఇమ్మిగ్రేషన్ కేసుల్లో దాదాపు 118 నకిలీ పత్రాలను సృష్టించి సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. వేర్వేరు వ్యక్తుల తరఫున వేసిన పిటిషన్లలో ఒకే రకమైన భాషను, ఒకే విధమైన కథనాలను, తప్పుడు సమాచారాన్ని కాపీ-పేస్ట్ చేసి అధికారులను బురిడీ కొట్టించేందుకు యత్నించారని నివేదిక స్పష్టం చేసింది. ఈయన దాఖలు చేసిన పిటిషన్లలో అత్యధికం భారత సంతతికి చెందిన వారివే కావడం గమనార్హం.

వలస వ్యవస్థ దుర్వినియోగం సహించేది లేదు:

ఈ చర్యలపై డీహెచ్‌ఎస్ (DHS) జనరల్ కౌన్సెల్ జేమ్స్ పెర్సివల్ స్పందిస్తూ.. నకిలీ అసిలమ్ క్లెయిమ్‌ల వల్ల అమెరికా పౌరుల భద్రతకే కాకుండా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. అక్రమంగా నివసిస్తున్నవారిని తొలగించే ప్రక్రియలో ఇవి జాప్యానికి కారణమవుతాయని తెలిపారు. వలస చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని, చట్టాలను దుర్వినియోగం చేసే లాయర్లు లేదా వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి



ఇటీవలి కాలంలో రెండో అతిపెద్ద కేసు:

అమెరికాలో నకిలీ ఆశ్రయం దరఖాస్తులపై ఉక్కుపాదం మోపాలనే ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక విచారణలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 2026లో వినోద్ దొడ్డమణి అనే మరో ఇమ్మిగ్రేషన్ లాయర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలతో $255,000 కంటే ఎక్కువ జరిమానా ప్రతిపాదించారు. ఇప్పుడు సూరజ్ రాజ్ సింగ్ కేసు రెండో పెద్ద చర్యగా నిలిచింది. ప్రస్తుతం సూరజ్ రాజ్ సింగ్‌పై చట్టపరమైన విచారణ కొనసాగుతోంది. అమెరికాలో అక్రమ మార్గాల్లో స్థిరపడాలని చూసేవారికి, వారికి సహకరించే ఏజెంట్లు, లాయర్లకు ఈ చర్యలు ఒక హెచ్చరికగా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *