Headlines

అమెరికాలో కాల్పుల మోత.. ఫుడ్ ఫెస్టివల్‌లో గన్ ఫైర్.. ఇద్దరు మృతి..

అమెరికాలో కాల్పుల మోత.. ఫుడ్ ఫెస్టివల్‌లో గన్ ఫైర్.. ఇద్దరు మృతి..


అమెరికాలోని సీటెల్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ స్పేస్ నీడిల్ ఐకానిక్ టవర్ సమీపంలో అత్యంత వేడుకగా జరుగుతున్న బైట్ ఆఫ్ సీటెల్ వార్షిక ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం సమయంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నగరవాసులు, పర్యాటకులు ఆహార పదార్థాల రుచులు ఆస్వాదిస్తూ, సంగీత ప్రదర్శనలను తిలకిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి అంటూ తుపాకీ శబ్దాలు వినిపించాయి. మొదట పటాకులు కాల్చుతున్నారని భావించినప్పటికీ, వెంటనే జనం భయంతో అరుస్తూ పపరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట వాతావరణం నెలకొంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. జనాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కంచెలు దూకి, చివరకు స్పేస్ నీడిల్ భవనం లోపలికి వెళ్లి తలదాచుకున్నారు. కొన్ని ఫుడ్ స్టాళ్ల లైవ్‌స్ట్రీమ్‌లలో “షూటింగ్.. షూటింగ్.. కిందకి వంగండి..” అంటూ ప్రజలు అరుస్తున్న భయాందోళన దృశ్యాలు రికార్డయ్యాయి.

ఇద్దరు దుర్మరణం.. ఐదుగురు ఆసుపత్రికి తరలింపు

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు, భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి గ్రేస్ నునెజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఐదుగురిని హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. క్షతగాత్రులలో ఒక చిన్నారి, 23 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలు ఉన్నారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి ప్రతినిధి సుసాన్ గ్రెగ్ వెల్లడించారు.

ఇద్దరు అనుమానితులు అదుపులోకి..

ఈ ఘటనపై సీటెల్ మేయర్ కేటీ విల్సన్ స్పందిస్తూ, కాల్పులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడికి కారణమేంటి? దీని వెనుక ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే విషయాలపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సంఘటనా స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఆ ప్రాంతానికి రావద్దని సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. పండుగ వాతావరణంలో సాగాల్సిన వేడుక రక్తాసిక్తమవ్వడంతో నగరంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

వీడియో చూడండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *