Yuzvendra Chahal : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక చిన్న పొరపాటు పంజాబ్ జట్టు కొంపముంచింది. టీ20 క్రికెట్‌లో క్యాచ్‌లు పడితేనే మ్యాచ్‌లు గెలుస్తాం అనే సామెతను నిజం చేస్తూ, స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వదిలేసిన ఒక క్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు ఏకంగా 108 పరుగుల భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ తప్పిదం వల్ల ముంబై బ్యాటర్లు నమన్ ధీర్, క్వింటన్ డికాక్ రెచ్చిపోయి ఆడి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఏమిటా పొరపాటు?
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకు 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్ కేవలం 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్కో యాన్సెన్ వేసిన బంతిని గాల్లోకి లేపాడు. అది నేరుగా యుజ్వేంద్ర చాహల్ చేతుల్లోకి వెళ్ళింది. అత్యంత ఈజీ ఆ క్యాచ్‌ను చాహల్ జారవిడిచాడు. అప్పటికి డికాక్, నమన్ ధీర్ మధ్య కేవలం 14 పరుగుల పార్టనర్ షిప్ మాత్రమే ఉంది. ఆ క్యాచ్ పట్టి ఉంటే ముంబై మూడో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడేది.
నమన్ ధీర్ – డికాక్ విధ్వంసం
చాహల్ ఇచ్చిన లైఫ్ నమన్ ధీర్ అద్భుతంగా వాడుకున్నాడు. డికాక్‌తో కలిసి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కలిసి కేవలం 68 బంతుల్లోనే 122 పరుగుల భారీ పార్టనర్ షిప్ నెలకొల్పారు. నమన్ ధీర్ తనపై నమ్మకం ఉంచి పైస్థానంలో పంపిన మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని నిలబెడుతూ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. క్యాచ్ మిస్ అయిన తర్వాత ఈ జోడీ అదనంగా 108 పరుగులు జోడించి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లింది.
చాహల్ పైనే ప్రతాపం
విచిత్రం ఏమిటంటే, క్యాచ్ వదిలేసిన చాహల్ పైనే ముంబై బ్యాటర్లు విరుచుకుపడ్డారు. చాహల్ వేసిన మొదటి ఓవర్ లోనే నమన్ ధీర్ సిక్సర్ తో స్వాగతం పలికాడు. అదే ఓవర్లో డికాక్ ఒక సిక్సర్, ఫోర్ బాదాడు. ఆ తర్వాత చాహల్ వేసిన మిగిలిన మూడు ఓవర్లలో డికాక్ మరో 3 భారీ సిక్సర్లు కొట్టాడు. తన స్పెల్ లో చాహల్ ధారాళంగా పరుగులిచ్చుకోవడమే కాకుండా, వికెట్ తీయడంలో కూడా విఫలమయ్యాడు.
That could be a game-changing drop from #YuzvendraChahal 😳
In a game of fine margins, will this drop come back to haunt Punjab Kings?#TATAIPL | #IPLRivalryWeek 2026 ➡️ #MIvPBKS | LIVE NOW 👉 https://t.co/wnST8NL0i2 pic.twitter.com/7hsRNeCg19
— Star Sports (@StarSportsIndia) April 16, 2026
ముంబై కోలుకుందిలా
ప్రారంభంలోనే రోహిత్ శర్మ లేకపోవడం, ఆపై వెంటనే 2 వికెట్లు పడిపోవడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అందరూ భావించారు. కానీ నమన్ ధీర్‌ను మూడో స్థానంలో పంపి హార్దిక్ పాండ్యా మాస్టర్ ప్లాన్ వేశాడు. చాహల్ చేసిన చిన్న పొరపాటు ముంబైకి వరంగా మారి.. పంజాబ్ కింగ్స్‌కు ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చింది. ఒక క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..