Headlines

Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు!

Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు!


Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు!

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో కురిసిన వడగళ్ల వాన రైతును నిలువునా ముంచింది. ముఖ్యంగా మందమర్రి, క్యాతనపల్లి, కోటపల్లి మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. శంకర్పల్లిలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లలో జాప్యం వల్లే తమకు ఈ గతి పట్టింది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు బెల్లంపల్లి, మందమర్రి పరిసరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు ఈదురు గాలులకు నేల రాలడంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు నెలకూలడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాలవర్షంతో రైతులు భారీగా నష్టపోయాయి. నేలకొండపల్లి, కూసుమంచి, కరకగూడెం మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయి. కాంటాలు వేసినా లారీలు రాకపోవడం, గోదాముల్లో చోటు లేకపోవడంతో పంటంతా రోడ్ల పక్కనే తడిసిపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు రోడ్డుపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసింది. మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి వెంకన్న అనే రైతు మృతి చెందడం విషాదాన్ని నింపింది. తాళ్ళపూసపల్లిలో రెండు ఎడ్లు మృత్యువాత పడ్డాయి. కొనుగోలు కేంద్రాలు, రహదారులపై ఆరబోసిన వడ్లు వర్షార్పణం కావడంతో రైతులు గుండె కోత అనుభవిస్తున్నారు. ఈదురు గాలుల ధాటికి మహబూబాబాద్ టౌన్‌లో రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. పలు చోట్ల దుకాణాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి.

అటు ఏపీలోనూ పలు జిల్లాలో అకాల వర్షాలు కురిసాయి. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లిలో అరటి రైతులు కుదేలయ్యారు. మూడు ఎకరాల్లో సాగు చేసిన అరటి తోట కోతకు వచ్చే సమయంలో గాలివానకు పూర్తిగా నేలమట్టమైంది. చేతికి వస్తుందనుకున్న పంట కళ్లముందే ధ్వంసం కావడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. లక్షల రూపాయల పెట్టుబడి పోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని వేడుకుంటున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో కురిసిన గాలివానకు విషాదం చోటుచేసుకుంది. వారపు సంత జరుగుతుండగా ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి ఒక భారీ వృక్షం సంతలో ఉన్న వారిపై కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు సందడిగా ఉన్న సంత ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మిన్నంటింది. మొత్తంగా ఎండ తాపానికి అల్లాడుతున్న జనానికి వర్షం ఉపశమనం కలిగిస్తుందని అనుకుంటే, అది అకాల వర్షమై రైతన్నల కన్నీటికి కారణమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *