ఎండలో ఉంచిన పుచ్చకాయ ఎందుకు విషంగా మారుతుంది: పుచ్చకాయలో సహజంగానే చక్కెరలు, నీరు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వేడికి ఇది త్వరగా స్పందిస్తుంది. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినప్పుడు, పండు లోపల కూడా వేడి పెరుగుతుంది. ఈ వేడికి లోపల ఉండే చక్కెరలు పులియడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పండు లోపల వాయువులువిడుదలవుతాయి.
లోపల నురుగు: మీరు పుచ్చకాయను కట్ చేసినప్పుడు లోపల నురుగు రావడం లేదా సబ్బు నీళ్లలా అనిపించడం గమనించారా? అంటే ఆ పండు లోపల తీవ్రమైన ఫర్మెంటేషన్ జరిగిందని అర్థం. ఇది పాడైపోయిన పండుకు సంకేతం. పండు కట్ చేయగానే పుల్లటి లేదా ఘాటైన వాసన వస్తే అది పూర్తిగా విషతుల్యమైనట్లు భావించాలి.
బ్యాక్టీరియా ముప్పు: పుచ్చకాయలు నేలపై పెరిగే పాదుల ద్వారా వస్తాయి. వీటి తొక్కపై సాధారణంగానే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల పండు పైతొక్క బలహీనపడి, చిన్నపాటి చీలికలు ఏర్పడతాయి. ఈ కంటికి కనిపించని రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి రసాన్ని కలుషితం చేస్తుంది. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగి తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు.
మంచి పుచ్చకాయను ఎలా గుర్తుపట్టాలి: మీరు మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు కొన్ని టిప్స్ పాటించండి. పండు ఒకవైపు పసుపు లేదా క్రీమ్ రంగులో మచ్చ ఉండాలి. అది నేల మీద ఉండి బాగా పండిందని అర్థం. తెల్లగా ఉంటే అది పచ్చిదని, రుచి ఉండదని గుర్తు. పండును తట్టినప్పుడు డబ్ డబ్ అని ఖాళీగా ఉన్నట్లు శబ్దం రావాలి. ఒకవేళ మొద్దుబారినట్లు శబ్దం వస్తే అది లోపల మెత్తబడి పాడైపోయిందని అర్థం. పుచ్చకాయ తొడిమ ఎండిపోయి ఉంటే అది సహజంగా పండినట్లు. పచ్చగా ఉంటే దాన్ని ముందే కోసేశారని అర్థం. చిన్నగా ఉన్నా బరువు ఎక్కువగా ఉన్న పండును ఎంచుకోండి. అందులో రసం ఎక్కువగా ఉంటుంది.
ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు: తప్పనిసరిగా కడగాలి: మార్కెట్ నుంచి తెచ్చిన పుచ్చకాయను కట్ చేసే ముందు ఉప్పు నీటితో లేదా పంపు కింద బాగా కడగాలి. దీనివల్ల తొక్కపై ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్లదు. కట్ చేసిన ముక్కలను గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువ ఉంచకూడదు. ఫ్రిజ్లో పెడితే గాలి చొరబడని డబ్బాలో ఉంచి 24 గంటల్లోపు తినేయాలి. పుచ్చకాయ తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీరు తాగితే జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. కొద్దిసేపు ఆగి తాగడం మేలు.




