Headlines

Vishwakarma Puja: విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!


Vishwakarma Jayanti Puja Telugu: హిందూ సంప్రదాయంలో విశ్వకర్మ భగవానుడిని దేవతల దివ్య శిల్పి, నిర్మాణకర్తగా భావిస్తారు. సృష్టిలోని అద్భుతమైన నిర్మాణాలు, రాజభవనాలు, నగరాలు, దివ్య ఆయుధాలను రూపొందించిన దేవశిల్పిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం కన్యా సంక్రాంతి సందర్భంగా విశ్వకర్మ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. 2026లో విశ్వకర్మ పూజను సెప్టెంబర్ 16న నిర్వహిస్తున్నప్పటికీ, సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి సమయం సెప్టెంబర్ 17న ఉదయం 7:58 గంటల సమయంలో ఉంటుందని పంచాంగ వివరాలు సూచిస్తున్నాయి. అందువల్ల పూజా సమయాన్ని స్థానిక పంచాంగాన్ని అనుసరించి నిర్ణయించుకోవడం మంచిది.

విశ్వకర్మ పూజ 2026 తేదీ, పుణ్యకాలం

కన్యా సంక్రాంతి అంటే సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే సమయం. విశ్వకర్మ పూజకు ఈ సౌర సంక్రమణకు ప్రత్యేక సంబంధం ఉంది. ఇతర అనేక పండుగలు చంద్రుడి తిథుల ఆధారంగా నిర్ణయించబడితే, విశ్వకర్మ పూజ ప్రధానంగా సంక్రాంతి ఆధారంగా జరుపుకునే పండుగగా భావిస్తారు. పంచాంగ వివరాల ప్రకారం, సెప్టెంబర్ 17న ఉదయం 7:58 గంటలకు కన్యా సంక్రాంతి సంభవిస్తుంది. అయితే పూజా సమయాల్లో ప్రాంతాలవారీగా స్వల్ప తేడాలు ఉండవచ్చు. కాబట్టి భక్తులు తమ ప్రాంతానికి సంబంధించిన స్థానిక పంచాంగాన్ని పరిశీలించి పూజా సమయాన్ని నిర్ణయించుకోవాలి.

విశ్వకర్మ భగవానుడు ఎవరు?

హిందూ పురాణ, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో విశ్వకర్మను దేవతల దివ్య శిల్పి, వాస్తుశిల్పి, నిర్మాణకర్తగా కొలుస్తారు. సృజనాత్మకత, శిల్పకళ, నిర్మాణం, యంత్ర పరిజ్ఞానం, నైపుణ్యానికి ఆయన ప్రతీకగా భావిస్తారు. పురాణ కథనాల ప్రకారం, శ్రీకృష్ణుడి కోసం ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థాన్ని విశ్వకర్మ నిర్మించినట్లు విశ్వాసం ఉంది. అలాగే సుదాముడి కోసం సుదామాపురి, బంగారు లంక, దేవతల కోసం స్వర్గలోక నిర్మాణంతో కూడా ఆయన పేరు ముడిపడి ఉంది.

ఇవి కూడా చదవండి



దివ్య ఆయుధాల సృష్టికర్తగా విశ్వకర్మ

విశ్వకర్మ భగవానుడికి దివ్య ఆయుధాల నిర్మాణంతోనూ ప్రత్యేక సంబంధం ఉంది. ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం, శ్రీమహావిష్ణువు ధరించే సుదర్శన చక్రం, పరమశివుడి త్రిశూలం, కార్తికేయుడి శక్తి ఆయుధం వంటి దివ్య ఆయుధాల రూపకల్పనలో విశ్వకర్మ పాత్ర ఉందని కథనాలు చెబుతాయి. అందుకే ఆయనను కేవలం శిల్పకారుల దేవుడిగానే కాకుండా నైపుణ్యం, సాంకేతికత, నిర్మాణశక్తికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు.

ఎవరు విశ్వకర్మ పూజ చేస్తారు?

విశ్వకర్మ పూజకు ముఖ్యంగా పనిముట్లు, యంత్రాలు, నిర్మాణం లేదా సాంకేతిక పనులతో సంబంధం ఉన్నవారు ప్రాధాన్యత ఇస్తారు. ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, మెకానిక్‌లు, శిల్పులు, కళాకారులు, టెక్నీషియన్లు, కర్మాగారాల్లో పనిచేసేవారు, నిర్మాణ రంగ కార్మికులు, యంత్రాలు, పరికరాలతో పనిచేసే వారు, వివిధ రకాల చేతివృత్తుల వారు.. తమ వృత్తికి ఉపయోగపడే పనిముట్లు, యంత్రాలు సురక్షితంగా పనిచేయాలని, వృత్తిలో అభివృద్ధి కలగాలని, జీవనోపాధి సాఫీగా సాగాలని కోరుతూ విశ్వకర్మ భగవానుడిని పూజిస్తారు.

విశ్వకర్మ పూజ రోజున పనిముట్లు, యంత్రాలను ఎందుకు పూజిస్తారు?

మనిషి తన నైపుణ్యాన్ని ఉపయోగించి జీవనోపాధి పొందేందుకు పనిముట్లు, యంత్రాలు, సాంకేతిక పరికరాలు ముఖ్యమైన ఆధారాలు. అందుకే వాటిని గౌరవించడం, శుభ్రంగా ఉంచడం, వాటి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడం విశ్వకర్మ పూజలో ముఖ్యమైన సంప్రదాయంగా మారింది. పూజకు ముందు యంత్రాలు, పనిముట్లు, వాహనాలు, ఇతర పరికరాలను శుభ్రం చేస్తారు. అనంతరం వాటిని విశ్వకర్మ భగవానుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఉంచి పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పనిలో నైపుణ్యం పెరుగుతుందని, యంత్రాలు సక్రమంగా పనిచేస్తాయని, వృత్తిలో అభివృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు

విశ్వకర్మ పూజను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, త్రిపుర, ఒడిశా, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహిస్తారు. కర్మాగారాలు, వర్క్‌షాప్‌లు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, చిన్నతరహా వృత్తి కేంద్రాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించే సంప్రదాయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విశ్వకర్మ పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విశ్వకర్మ పూజా కార్యక్రమాలు ఇళ్లతోపాటు ఆలయాలు, కార్యాలయాలలో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులు(మను, మయ,త్వష్ట,శిల్పి,విశ్వజ్ణ – కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారులు) విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కార్మికులు, శిల్పులు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు తమ పనిముట్లను పూజించి విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులు కోరుకుంటారు.

విశ్వకర్మ పూజలోని ఆధ్యాత్మిక సందేశం

విశ్వకర్మ పూజ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మన జీవనోపాధికి తోడ్పడే పని, నైపుణ్యం, పనిముట్లను గౌరవించాలి అనే భావన ఇందులో ఉంది. మన చేతుల్లోని నైపుణ్యానికి, మనం చేసే కృషికి దైవస్మరణను జోడించి కృతజ్ఞతతో ముందుకు సాగడమే ఈ పూజ వెనుక ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక భావంగా భక్తులు భావిస్తారు. అందుకే విశ్వకర్మ పూజ కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా కష్టం, నైపుణ్యం, సృజనాత్మకత, కర్మ పట్ల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు హిందూ సంప్రదాయాలు, పురాణ విశ్వాసాలు, పంచాంగ సమాచారాన్ని ఆధారంగా చేసుకున్నవి. పూజా సమయాల్లో ప్రాంతానుసారం మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *