Headlines

Video: మస్క్ బ్యాగులు మోసిన రోబో.. రైల్వే కూలీలకు ఎసరు ..? నెట్టింట చర్చ


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎలాన్ మస్క్ తన ప్రైవేట్ జెట్ నుంచి కిందికి దిగుతూ కనిపించారు. ఆయన వెనుకే ఓ హ్యూమనాయిడ్ రోబోట్ రెండు సూట్‌కేసులను తీసుకుని నడుచుకుంటూ వెళ్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో లగేజీని సిబ్బంది మోస్తుంటారు. కానీ ఇక్కడ ఆ పని ఓ రోబో చేస్తుండటమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రోబో టెస్లా అభివృద్ధి చేస్తున్న ‘ఆప్టిమస్’ (Optimus) అయి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

Humanoid robot carries Elon Musk’s luggage after he steps out of his private jet

‘ఇది పెద్ద మార్పుకు సంకేతం’

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేశారు. రెండు సూట్‌కేసులు మోస్తున్న రోబోట్‌ను చూస్తే ఇదేదో చిన్న టెక్నాలజీ డెమోలా అనిపించవచ్చని, కానీ దీని వెనుక పెద్ద మార్పు ఉందని అన్నారు. ఇప్పటివరకు ఫ్యాక్టరీలకు పరిమితమైన హ్యూమనాయిడ్ రోబోలు త్వరలో మన ఇళ్లలోకి ప్రవేశిస్తాయనీ,  టెక్నాలజీతో ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, ఉద్యోగ రంగంలో భారీ మార్పులు రావచ్చని హెచ్చరించారు.

రోబోలు వస్తే ఉద్యోగాలు ఏమవుతాయి?

హర్ష్ గోయెంకా వీడియో పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు రోబోల రాకను స్వాగతిస్తూ పనులు వేగంగా పూర్తవుతాయని, మనుషుల శ్రమ తగ్గుతుందని అన్నారు. మరికొందరు ఎక్కువ మంది కార్మికులపై ఆధారపడే భారత్ వంటి దేశాల్లో ఆటోమేషన్ ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నలు లేవనెత్తారు. రోబోలకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగితే పరిస్థితి ఏంటి? అవి మనుషుల మధ్య అనూహ్యంగా ప్రవర్తిస్తే ఎవరిది బాధ్యత? అందుకే రోబోల వినియోగానికి కొన్ని పరిమితులు ఉండాలని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. నిజానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. వస్తువులను ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించడం, పరిశ్రమల్లో పనిచేయడం, ఇతర సాధారణ పనులు చేయడం వంటి సామర్థ్యాలను రోబోలలో అభివృద్ధి చేస్తున్నారు.

రైల్వే కూలీల పరిస్థితి ఏంటి?

ఈ చర్చలో భారతీయ రైల్వే స్టేషన్లలో పనిచేసే కూలీల ప్రస్తావన కూడా వచ్చింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలకు రోబోల రాక మరో సమస్యగా మారవచ్చని ఓ నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల లగేజీ మోసే పనిని కూడా రోబోలు చేయడం మొదలుపెడితే, ఆ పనిపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు.

మొత్తానికి ఎలాన్ మస్క్ లగేజీ మోస్తున్నట్లు కనిపిస్తున్న ఈ రోబో వీడియో భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎలా మారబోతున్నాయనే ప్రశ్నను ముందుకు తెచ్చింది. రోబోలు మనుషులకు సహాయకులుగా మారతాయా? లేక మనుషులు చేసే పనులనే ఆక్రమిస్తాయా? అన్నది ఆసక్తికర చర్చగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *