Headlines

Vaibhav Sooryavanshi : అంతా ఓకే..కానీ ఆ ఒక్క విషయంలో మారాలి.. వైభవ్ సూర్యవంశీకి వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్

Vaibhav Sooryavanshi : అంతా ఓకే..కానీ ఆ ఒక్క విషయంలో మారాలి.. వైభవ్ సూర్యవంశీకి వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్


Vaibhav Sooryavanshi : జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు ఘనవిజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‎తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత తాత్కాలిక ప్రధాన కోచ్ వివిఎస్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే వైభవ్ చూపుతున్న ఆత్మవిశ్వాసం, పరిణతి అద్భుతమని కొనియాడిన లక్ష్మణ్, భవిష్యత్తులో అతను మరింత ఎదగడానికి ఓ కీలకమైన సలహా ఇచ్చారు.

రెండున్నర ఏళ్ల క్రితమే వైభవ్ టాలెంట్‌ను గుర్తించిన బిసిసిఐ

వైభవ్ సూర్యవంశీలోని ప్రతిభను బీసీసీఐ రెండున్నర సంవత్సరాల క్రితమే గుర్తించిందని లక్ష్మణ్ వెల్లడించారు. 2024 అండర్-19 ప్రపంచ కప్‌కు ముందు విజయవాడలో జరిగిన క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున వైభవ్ అత్యధిక పరుగులు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచే అతనికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్యాంపుల్లో శిక్షణ ఇస్తూ, అండర్-19 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచేలా తీర్చిదిద్దామని తెలిపారు. వైభవ్ ఒక ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎలాంటి ఆలోచనా ధోరణి కలిగి ఉంటాడో మేనేజ్‌మెంట్‌కు పూర్తిగా తెలుసని లక్ష్మణ్ చెప్పారు.

మానసిక పరిణితి అద్భుతం.. కానీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి

గత ఆరు నెలల కాలంలో వైభవ్ వ్యక్తిగతంగా ఎదిగిన తీరు, ఆటపై అతనికి ఉన్న అవగాహన, మెచ్యూరిటీ లెవల్స్ ఆకాశాన్ని తాకాయని లక్ష్మణ్ ప్రశంసించారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద బౌలర్లను ఎదుర్కొంటూ ఒత్తిడి సమయాల్లోనూ రాణించగలుగుతున్నాడని చెప్పారు. అయితే వైభవ్ ఇంకా చాలా మెరుగుపడాల్సిన ఏకైక ప్రధాన అంశం అతని ఓవరాల్ ఫిట్‌నెస్ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అతను ఇంకా 15 ఏళ్ల చిన్న కుర్రాడేనని, రాబోయే రోజుల్లో తన ఫిట్‌నెస్‌ స్థాయిలను పెంచుకుంటే క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ప్లేయర్‌గా మారతాడని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

మైదానంలో వైభవ్ చూపిన తపన అమోఘం

ఆటలోని ప్రతి విభాగంలోనూ తానను తాను మెరుగుపరుచుకోవాలనే తపన వైభవ్‌లో స్పష్టంగా కనిపిస్తుందని కోచ్ లక్ష్మణ్ కొనియాడారు. మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో దెబ్బ తగిలి గాయపడినప్పటికీ, మైదానాన్ని వదిలి వెళ్లకుండా జట్టు కోసం ఫీల్డింగ్ కొనసాగించాలని వైభవ్ భావించాడని తెలిపారు. కానీ జట్టు ఫిజియో వచ్చి బలవంతంగా అతనిని బయటకు తీసుకువెళ్లారని చెప్పారు. చిన్న వయసులోనే జట్టు విజయం కోసం అతను చూపించిన ఈ అంకితభావం, పట్టుదల నిజంగా అభినందనీయమని లక్ష్మణ్ ప్రశంసించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *