హైదరాబాద్, మే 3: రాష్ట్రంలోని 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్2026 ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 4) నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా జారీ చేశారు. ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,01,194 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపట్నుంచి మొదలయ్యే ఈఏపీసెట్ ఆన్లైన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ కన్వీనర్ డాక్టర్ కె విజయ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
పరీక్ష రోజున ఈ తప్పులొద్దు..
- ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు ఉదయం సెషన్లో 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్లో 1.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. నిర్ణిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- పరీక్ష కేంద్రంలో విద్యార్థులందరికీ బయో మెట్రిక్ అటెండెన్స్తప్పనిసరిగా ఉంటుంది.
- ఈ క్రమంలో విద్యార్ధులు మెహిందీ, టాటూస్, ఇంక్ ముద్రలు చేతులపై ఉంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. బ్లాక్ లేదా బ్లూ పెన్, హాల్ టికెట్, ఏదైనా ఒక గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
- అలాగే క్యాలిక్యులేటర్, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, సెల్ఫోన్లు, చేతి వాచ్‌లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.