మీరు నేషనల్ హైవేపై కారులో ప్రయాణం చేస్తున్నారు..? ప్రస్తుతం ఉన్న విధానంలో టోల్ ప్లాజాల వద్ద ఆగితే మన కారుపై ఉండే ఫాస్టాగ్ స్కాన్ అవుతుంది. మన అకౌంట్ నుంచి ఛార్జీలు కట్ అయ్యాక వాహనం ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. దీని వల్ల కొద్ది నిమిషాల పాటు టోల్ గేట్ల వద్ద ఆగాల్సి వస్తుంది. దీని వల్ల రద్దీ సమాయాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఏర్పడుతుంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది. ఇక నుంచి మీరు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనే లేదు. వాహనం ఆపకుండానే టోల్ ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా కొత్త వ్యవస్థను మే1న కేంద్రం ప్రవేశపెట్టింది. గుజరాత్‌లోని సూరత్-భరూచ్ ఎన్‌హెచ్-48పై కేంద్ర రోడ్డు, రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ప్రారంభించారు. రాబోయే రోజుల్లో అన్ని హైవేలపై ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు.
మే 1 నుంచి అమల్లోకి..
ఎన్‌హెచ్-48లోని చోర్యాసి టోల్ గేట్ వద్ద దేశంలో తొలిసారిగా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో బారియర్ లెస్ టోలింగ్ సిస్టమ్‌ను మే 1న కేంద్రం ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ద్వారా మీ ఫాస్టాగ్ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ కట్ అవుతుంది. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగడం, ట్రాఫిక్ రద్దీ నెలకొనడం లాంటివి ఉండవ్. ఈ కొత్త సిస్టమ్ వల్ల వేగంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. టోల్ చెల్లింపు వ్యవస్థలో మాన్యువల్ ప్రక్రియను ఇది తగ్గిస్తుంది. ప్రయాణ సమయం కూడా దీని వల్ల తగ్గుతుంది. సరుకు రవాణా, లాజిస్టిక్స్ రంగాలకు ఇది మరింత ఉపయోగపడుతుందని, సులభతరమైన వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులపై మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. దేశలో టోలింగ్ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం, ఆధునీకరించడంలో ఇది ఒక ముఖ్య ముందడుగా చెప్పారు. భవిష్యత్తులో జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ చర్యలు ఉపయోగడపతాయని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో అన్ని చోట్ల..
భవిష్యత్తులో అన్ని జాతీయ రహదారులపై ఆటోమేటిక్ టోల్ వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టేందుకు సన్నాహలు చేస్తోంది. దీని వల్ల వాహనదారులు ఎక్కడా ఆగాల్సిన పని ఉండదు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా మెరుగైన ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. కొత్తగా నిర్మించే హైవేలపై ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు.