Headlines

Telangana: చేతులు లేకపోతేనేం.. గుండెధైర్యం ఉందిగా.. విధినే ఎదురించి పిల్లల ఆకలి తీరుస్తున్న రియల్ హీరో..


చేతులు లేకపోతే జీవితం ఆగిపోతుందా..? కాళ్లు, చేతులు సక్రమంగా ఉంటేనే బతుకు బండిని లాగగలమా..? కచ్చితంగా కాదు అంటున్నాడు మందమర్రికి చెందిన కుంజు వినోద్ కుమార్. ఒకప్పుడు సాధారణ యువకుడిలా తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. ఐటీఐ పూర్తి చేసి వెల్డింగ్ పనిలో నైపుణ్యం సంపాదించాడు. ఓ షాపులో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలోనే విధి పగబట్టింది. 2015లో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీలో ఓ భవనంపై పనిచేస్తున్నాడు వినోద్ కుమార్. ఆ సమయంలో పైపును కిందికి దించుతుండగా.. పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగిలింది. అంతే.. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై రెండు చేతులనూ కోల్పోయాడు. ఆ ఒక్క క్షణం అతడి జీవితాన్నే తలకిందులు చేసింది. కుటుంబాన్ని పోషించే చేతులే లేకుండా పోయాయి. అప్పటివరకు తన శ్రమను నమ్ముకున్న వినోద్‌కు జీవితం భారంగా మారింది. అయినా అతడు ఓటమిని అంగీకరించలేదు.

రెండు చేతులు కోల్పోయినా.. బతకాలన్న ఆశను మాత్రం కోల్పోలేదు. కృత్రిమ చేతులను అమర్చుకుని తిరిగి తన వృత్తిలోకి అడుగుపెట్టాడు. ఐటీఐలో నేర్చుకున్న నైపుణ్యమే అతడికి ఇప్పుడు జీవనాధారంగా మారింది. వెల్డింగ్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లల ఆకలి తీర్చేందుకు, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్రతిరోజూ శ్రమిస్తున్నాడు. శరీరం సహకరించకపోయినా.. మనసులోని సంకల్పం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని.. మరొకరి దగ్గర దినసరి కూలీగా పనిచేసే పరిస్థితి నుంచి బయటపడాలని ఆశిస్తున్నాడు. సొంతంగా ఓ వెల్డింగ్ షాప్ ఏర్పాటు చేసుకోవాలన్నది వినోద్ కల. అందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేక అడుగు ముందుకు వేయ లేకపోతున్నాడు. ప్రభుత్వ పథకాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని.. దాతలు, స్వచ్ఛంద సంస్థలు తనకు అండగా నిలవాలని వేడుకుంటున్నాడు.

కష్టాలు వస్తే కుంగిపోవడం కాదు.. వాటిని ఎదురించి నిలబడటమే నిజమైన ఆత్మస్థైర్యం. రెండు చేతులు లేకున్నా కుటుంబం కోసం చెమటోడుస్తున్న వినోద్ కుమార్ జీవితం అందరికీ ఓ పాఠం. అతడికి కావాల్సింది జాలి కాదు.. తన కాళ్లపై తాను నిలబడేందుకు ఓ అవకాశం. సొంతంగా వెల్డింగ్ షాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక చేయూత అందితే.. మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఓ చిన్న సహాయం.. ఓ కుటుంబానికి పెద్ద భరోసా కావచ్చు. ఓ ఆపన్న హస్తం.. ఓ జీవితానికి కొత్త వెలుగులు నింపవచ్చు. చేతులు కోల్పోయిన వినోద్‌కు.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు మనమంతా ఆసరాగా నిలుద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *