Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!


ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఉండకూడదని, ఆధునిక సాంకేతికతతో సేవలను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

రైతు డిస్కం అంశంపై ఉద్యోగులు, సిబ్బందిలో ఉన్న అపోహలను వెంటనే తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో మార్పులు తీసుకురావడంలో ఉద్యోగుల సహకారం కీలకమని తెలిపారు. ట్రాన్స్ఫర్మర్లపై ఓవర్ లోడ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి వేగం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్, కొత్త పారిశ్రామిక వాడల వల్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయని, అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలులో వేగం పెంచాలని, దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యంగా అనుమతులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ అనుమతులు వెంటనే ఇవ్వాలని కూడా ఆదేశించారు.

సోలార్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ వినియోగంపై అవగాహన కల్పించాలని, సబ్ స్టేషన్ల పక్కనే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో 18 సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ను మినహాయించి ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఈ ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు. దీనికి నోడల్ అధికారులను నియమించాలని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *