Headlines

Telangana: గుట్టపైన ఆలయం.. దిగువన ధ్వజస్తంభం.. ఈ ఆలయ ప్రత్యేక తెలిస్తే..


సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి పెద్దగట్టు.. యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ లింగమంతుల స్వామి కొలువైన పుణ్యక్షేత్రం. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఉండే ఈ క్షేత్రం నిత్యం భక్తుల పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే పెద్దగట్టు జాతరతో ఈ ప్రాంతం భక్తజన సంద్రమవుతుంది.

కొండపై స్వామి.. కొండ కింద ధ్వజస్తంభం..

లింగమంతుల స్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేకత కేవలం జాతర మాత్రమే కాదు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటారు. కానీ పెద్దగట్టు క్షేత్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన ఏర్పాటు కనిపిస్తుంది. గుట్టపై లింగమంతుల స్వామి కొలువై ఉంటే.. గుట్ట దిగువన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఏడడుగుల ఎత్తుతో, పురాతన ఏకశిలా రాతి ధ్వజస్తంభం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. దాదాపు 300 ఏళ్ల నాటి ఈ ధ్వజస్తంభాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఏ కాలంలో ఏర్పాటు చేశారు? గుట్టపైన ఆలయానికి, కింద ఉన్న ధ్వజస్తంభానికి మధ్య ఉన్న ఆగమ సంబంధం ఏమిటి అన్నది అంతుచిక్కని రహస్యంగానే ఉంది.

యాదవులే పూజారులు.. అనాదిగా వస్తున్న ఆచారం..

ఈ ఆలయానికి మరో పెద్ద విశిష్టత ఉంది. తరాలు మారాయి.. కానీ పెద్దగట్టు క్షేత్రంలో ఆచార సంప్రదాయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ పూజా కార్యక్రమాల్లో యాదవ కుటుంబాలదే కీలక పాత్ర. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను వారే కొనసాగిస్తున్నారు. అనాదిగా యాదవులే పూజారులుగా వ్యవహరిస్తూ, స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఈ క్షేత్రాన్ని భక్తిశ్రద్ధలతో కాపాడుకుంటూ వస్తున్నారు.

తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర..

రెండేళ్లకు ఒకసారి దురాజ్‌పల్లి గుట్టపై జరిగే ‘పెద్దగట్టు జాతర’ (గొల్లగట్టు జాతర) తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రసిద్ధి గాంచింది. సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద ఉత్సవంగా దీనికి పేరుంది. ఈ జాతర జరిగిందంటే చాలు.. దురాజ్‌పల్లి పరిసరాలన్నీ భక్తజనసంద్రంగా మారిపోతాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గంపల ప్రదక్షిణలు, బోనాల సమర్పణ, చంద్రపట్నం, నెలవారం, మకర తోరణం ఊరేగింపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి. భేరీల మోతలు, డప్పుల చప్పుళ్లు, యాదవుల సంప్రదాయ నృత్యాలు, ‘ఓ లింగా.. ఓ లింగా’ నామస్మరణతో పెద్దగట్టు పరిసరాలు మార్మోగుతాయి. కేవలం తెలంగాణ నుంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది యాదవ భక్తులు ఇక్కడికి తరలివస్తారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని పునీతులవుతారు.

మూడు వందల ఏళ్ల నాటి ఆనవాళ్లు..

ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం దేవరపెట్టె. సూర్యాపేట మండలం కేసారం నుంచి సంప్రదాయబద్ధంగా తీసుకొచ్చే దేవరపెట్టెలో వివిధ దేవతా మూర్తులు ఉంటాయి. జాతర ప్రారంభంలో దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దగట్టుకు తీసుకురావడం ఆనవాయితీ. మెంతబోయిన, మున్న, గొర్ల వంటి యాదవ కుటుంబాల సంప్రదాయ పాత్ర కూడా ఈ ఉత్సవాల్లో ప్రత్యేకం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాలు పెద్దగట్టు జాతరకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

2027 ఫిబ్రవరిలో పెద్దగట్టు జాతర..

మరో మూడు నెలల్లోనే ఈ మహా అద్భుత ఘట్టం, అత్యంత వైభవంగా జరిగే పెద్దగట్టు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెద్దగట్టు భక్తులకు మరోసారి ఆధ్యాత్మిక సందడి మొదలుకానుంది. 2027 ఫిబ్రవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజులపాటు మహాజాతర నిర్వహించాలని తాజాగా తేదీలు ఖరారు చేశారు. ఫిబ్రవరి 21న కేసారం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టుకు తీసుకొచ్చి గంపల ప్రదక్షిణలతో జాతరకు శ్రీకారం చుడతారు. 22న బోనాలు, 23న చంద్రపట్నం, 24న నెలవారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 25న ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఈ క్షేత్రం యాదవుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *