Tamil Nadu Elections: అధికారం కోల్పోయేదిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త

Tamil Nadu Elections: అధికారం కోల్పోయేదిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే ఈ ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధికార డీఎంకే కూటమిని కోలుకోలేని దెబ్బ తీశాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళ వెట్రి కళగం’ అద్భుతమైన ఆధిక్యంతో దూసుకుపోతుండటంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే డీఎంకేకు వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటల సమయానికే తమిళ వెట్రి కళగం 100 స్థానాల మార్కును దాటేసింది.

ప్రస్తుత సమాచారం ప్రకారం తమిళ వెట్రి కళగం 106 స్థానాల్లో, అన్నాడీఎంకే కూటమి 67 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అన్నాడీఎంకే, టీవీకే మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సీఎం స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో 6,500 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. స్టాలిన్‌తో పాటు డీఎంకే కేబినెట్‌లోని మెజారిటీ మంత్రులు కూడా టీవీకే అభ్యర్థుల చేతిలో వెనుకంజలో ఉండటం గమనార్హం.

డీఎంకే కార్యకర్తల కన్నీళ్లు

వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం వద్దకు భారీగా చేరుకున్న డీఎంకే కార్యకర్తలు, ఫలితాలు చూసి షాక్‌కు గురయ్యారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న విజయోత్సవ సభలను చూస్తూ కార్యకర్తలు కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఈ స్థాయిలో ఓటమి ఎదురవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.

ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే కార్యకర్తలు మాట్లాడుతూ.. ప్రజల కోసం డీఎంకే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసినా ఇలాంటి ఓటమిని ఎదుర్కొవడం దారుణమని, తమ నాయకుడు స్టాలిన్ ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని క్యాకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంచనాలను తారుమారు చేసిన విజయ్

ఇదిలా ఉండగా ఎన్నికల ముందు వచ్చిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. కానీ క్షేత్రస్థాయిలో ఓటర్ల తీర్పు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తమిళ వెట్రి కళగం పార్టీ మొదటి ప్రయత్నంలోనే మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతుండటంతో తమిళనాట సరికొత్త రాజకీయ శకం మొదలైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *