Headlines

Solar Eclipse: 2027లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా.. సూతక కాలం వర్తిస్తుందా?


First Solar Eclipse 2027: ఖగోళ సంఘటనల పరంగా 2027 సంవత్సరం ప్రత్యేకంగా నిలవనుంది. ఈ ఏడాది ఆకాశంలో సూర్య, చంద్ర గ్రహణాలతో పాటు పలు అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. జ్యోతిష్య, మతపరమైన విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహణాలు రాశులపై, దేశాలపై ప్రభావం చూపుతాయని కొందరు నమ్ముతారు. 2027లో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి నెలలో ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రత్యేకత ఏమిటంటే.. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం కనిపించే అవకాశం ఉంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని ‘అగ్నివలయం’ (రింగ్ ఆఫ్ ఫైర్) అని పిలుస్తారు. మరి ఈ గ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? భారతదేశంలో కనిపిస్తుందా? సూతక కాలం వర్తిస్తుందా? తెలుసుకుందాం.

2027 తొలి సూర్యగ్రహణం ఎప్పుడు?

2027 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 6, శనివారం నాడు సంభవించనుంది. ఇది కంకణాకార సూర్యగ్రహణం (Annular Solar Eclipse). ఈ సమయంలో చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యగా ప్రయాణిస్తాడు. అయితే, సూర్యుడిని పూర్తిగా కప్పివేయలేడు. చంద్రుడి పరిమాణం సూర్యుడి కంటే చిన్నగా కనిపించడం వల్ల సూర్యుని అంచులు ప్రకాశవంతంగా మిగిలి, ఆకాశంలో అగ్నివలయం ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ దృశ్యం ఖగోళ ప్రేమికులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా?

ఫిబ్రవరి 6న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. గ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి కావడంతో సూర్యుడు ఆకాశంలో ఉండడు. అందువల్ల దేశంలోని ఏ ప్రాంతం నుంచీ ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేరు.

ఇవి కూడా చదవండి



సూతక కాలం వర్తిస్తుందా?

హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్యగ్రహణానికి సుమారు 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసివేయడం, శుభకార్యాలకు దూరంగా ఉండడం వంటి ఆచారాలు పాటిస్తారు. భగవంతుని నామస్మరణ, మంత్రజపం చేయడం పవిత్రంగా భావిస్తారు. అయితే, ఫిబ్రవరి 6న ఏర్పడే గ్రహణం భారతదేశంలో కనిపించనందున, సాధారణ సంప్రదాయం ప్రకారం ఇక్కడ సూతక కాలం వర్తించదు.

ఎక్కడ కనిపిస్తుంది?

ఈ కంకణాకార సూర్యగ్రహణం దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రాంతాల్లో కనిపించనుంది.

2027లో ఎన్ని సూర్యగ్రహణాలు?

2027లో మొత్తం రెండు సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. మొదటిది ఫిబ్రవరి 6న కంకణాకార గ్రహణం కాగా, రెండోది ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఆగస్టు గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లో కూడా ఈ గ్రహణాన్ని పాక్షికంగా వీక్షించే అవకాశం ఉంది.

(Disclaimer: ఈ కథనంలో గ్రహణాలకు సంబంధించిన ఖగోళ సమాచారం, మతపరమైన విశ్వాసాలు వివరించబడ్డాయి. సూతక కాలం, గ్రహణ ప్రభావాలు వంటి అంశాలు సంప్రదాయ నమ్మకాల ఆధారంగా పేర్కొనబడ్డాయి. వీటిని శాస్త్రీయ వాస్తవాలుగా భావించకూడదు. గ్రహణ వీక్షణ సమయంలో తప్పనిసరిగా తగిన కంటి రక్షణ పరికరాలను ఉపయోగించాలి.)

మరిన్ని ఆసక్తికర జ్యోతిష్యం కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *