Headlines

స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEd వాళ్లు రాయొచ్చా..?

స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEd వాళ్లు రాయొచ్చా..?


గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా 2028 సెప్టెంబర్ నాటికి టెట్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. టెట్‌లో అర్హత సాధించని ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగలేరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టీజీ టెట్‌-ఇన్‌ సర్వీస్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్ష తెలంగాణలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, టీజీఆర్‌ఈఐఎస్‌, ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, తెలంగాణ మోడల్ స్కూల్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుంది.

పేపర్ 1 పరీక్ష ఎవరు రాయాలంటే?

డీఈఎల్ఈడ్‌ (D.El.Ed) లేదా బీఎడ్‌ అర్హతతో నియమితులైన సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTలు), ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్‌మాస్టర్లు మాత్రమే పేపర్ 1 పరీక్షకు అర్హులు.

పేపర్ 2 పరీక్ష ఎవరు రాయాలంటే?

స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు, లాంగ్వేజ్ పండితులు, హైస్కూల్ హెడ్‌మాస్టర్లు పేపర్2 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌/బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. టెట్ పరీఓలో జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులు చొప్పున సాధిస్తేనే అర్హత పొందినట్లు పరిగణిస్తారు.

టీజీ టెట్‌-ఇన్‌ సర్వీస్ పరీక్ష ఎలా ఉంటుందంటే..?

టీజీ టెట్‌-ఇన్‌ సర్వీస్ పరీక్షలు 2026 సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో నిర్వహించబడతాయి. ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2 నుంచి 4.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. మొత్తం 150 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు (MCQs) ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఈ స్పెషల్ టెట్‌ పరీక్ష కేవలం ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది. బీఎడ్‌, డీఎడ్‌ ఉత్తీర్ణత పొందిన నిరుద్యోగ అభ్యర్ధులు ఈ టెట్‌ రాసేందుకు అనుమతి లేదు. అంటే కేవలం ప్రభుత్వ టీచర్ల కోసం మాత్రమేనన్నమాట.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 29, 2026.
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూలై 29, 2026.
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: ఆగస్టు 31 నుంచి
  • ఆన్‌లైన్‌ రాత పరీక్షల తేదీలు: సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు
  • ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య

టీజీ స్పెషల్‌ టెట్‌-ఇన్‌ సర్వీస్ టీచర్స్‌-2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *